imran khan: ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్!

  • ఈసీపీ ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు
  • పత్రికలు, టీవీల్లో ఇమ్రాన్ ఫొటోలు రావడంపై అసంతృప్తి
  • ఇమ్రాన్ న్యాయవాది వాదనను అంగీకరించని కమిషన్

పాకిస్తాన్ కాబోయే ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఎన్నికల సంఘానికి  క్షమాపణలు చెప్పారు. జూలై 25న నేషనల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మీడియాకు, ప్రజలందరికీ కనిపించేలా ఇమ్రాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫొటోలను పలు పత్రికలు ప్రచురించడం, టీవీల్లో ప్రసారం కావడంతో ఇమ్రాన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. 

వాస్తవానికి చుట్టూ అడ్డుగా కట్టిన తెరవెనుకే ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ఫిర్యాదును విచారించిన పాక్ ఎన్నికల సంఘం(ఈసీపీ) ప్రధాన కమిషనర్ సర్దార్ మొహమ్మద్ రజా.. ఇమ్రాన్ బహిరంగంగా ఓటేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ప్రమేయం లేకుండానే మీడియా ఫొటోలు తీసిందని ఆయన న్యాయవాది చెప్పిన వాదనను కమిషన్ అంగీకరించలేదు.

ఈ విషయంలో రాతపూర్వకంగా క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించారు. దీంతో ఈ రోజు ఇమ్రాన్ పాక్ ఎన్నికల సంఘం డిమాండ్ మేరకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ సమర్పించారు. ఇస్లామాబాద్ లోని ఎన్-53 నియోజకవర్గంలో ఇమ్రాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎటువంటి అడ్డుతెర లేకుండా ఇమ్రాన్ ఓటేయడంతో ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. పాక్ ఎన్నికల చట్టం సెక్షన్ 185 ప్రకారం ఓటును ఎవరికి వేస్తున్నామో బహిరంగంగా ప్రదర్శిస్తే.. ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తారు.

More Telugu News