brirish airways: మనకు గౌరవం ఇవ్వని ఆ విమానాలను ఎక్కకండి.. భారతీయులకు రిషీ కపూర్ పిలుపు!

  • బ్రిటిష్ ఎయిర్ వేస్ పై బాలీవుడ్ నటుడి ఆగ్రహం
  • తననూ గతంలో రెండు సార్లు అవమానించారని వెల్లడి
  • ఎమిరేట్స్ లేదా జెట్ ఎయిర్ విమానాలు ఎక్కాలని సూచన

బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ మండిపడ్డారు. లండన్ లో భారతీయుల్ని విమానం నుంచి దురుసుగా దించేసి ఆ సంస్థ జాతి వివక్షను ప్రదర్శించడంపై ఆయన సీరియస్ అయ్యారు. గతంలో తన పట్ల కూడా బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వెల్లడించారు. ఆ సంస్థ విమానాలు ఎక్కవద్దని ప్రజలకు సూచించారు.

ఈ మేరకు రిషీ కపూర్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్ష చర్యే. గతంలో విమానం ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ..  రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. కనీసం అక్కడ గౌరవం అయినా దక్కుతుంది’ అని ట్వట్ చేశారు.

కేంద్రంలో జాయింట్ సెక్రటరి హోదా ఉన్న ఏపీ పాఠక్, తన భార్య, మూడేళ్ల కుమారుడితో కలసి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో జూలై 23న లండన్ నుంచి బెర్లిన్ కు బయలుదేరారు. అయితే సదరు అధికారి కుమారుడు బెదిరి ఏడవడంతో అక్కడికి చేరుకున్న ఓ క్రూ సిబ్బంది.. పాఠక్ భార్య, ఆయన కుమారుడిని దూషించాడు. అనంతరం  జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశాడు. చివరికి పాఠక్ కుటుంబంతో పాటు విమానంలోనే ఉన్న భారతీయుల్ని ఎయిర్ పోర్ట్ లో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పాఠక్ కేంద్ర విమానయాన మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా విచారణకు ఆదేశించింది.

More Telugu News