నా దగ్గర చెట్లకు డబ్బులు కాయడం లేదు!: విమర్శకులపై సీఎం కుమారస్వామి ఫైర్

10-08-2018 Fri 12:50
  • ప్రభుత్వంపై రూ.49 వేల కోట్ల రుణభారం ఉందని వ్యాఖ్య
  • ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని వెల్లడి
  • సంక్షేమ పథకాలపై వెనక్కి తగ్గబోమని స్పష్టీకరణ
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సీట్లను ప్రజలు తనకు ఇవ్వలేదని సీఎం కుమారస్వామి గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధుల్ని త్వరగా విడుదల చేయడం లేదని కొందరు విమర్శించడంపై కుమారస్వామి మండిపడ్డారు.

ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా బెంగళూరులో మాట్లాడుతూ.. ‘రైతు రుణమాఫీ, షాదీ భాగ్య, ఇతర పథకాలకు నేను నిధులు కేటాయించడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్లందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే. అనుకున్న వెంటనే ఇచ్చేయడానికి నా దగ్గర చెట్లకు డబ్బులు కాయడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

పథకాల అమలు, నిధుల విడుదలలో తాను అధికారుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కుమారస్వామి తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. నిధులు విడుదల చేయాల్సిందిగా తాను అధికారుల్ని ఆదేశిస్తూ ఉంటానని వెల్లడించారు. ప్రభుత్వంపై రూ.49,000 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేయాల్సిన బాధ్యత ఉందనీ, కాబట్టి ప్రజలు కొంచెం సహనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు రానివ్వబోనని కుమారస్వామి స్పష్టం చేశారు.