KCR: గజం రూ. 100కే... రాజకీయ పార్టీల కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయింపు!

  • జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణానికి సాయం
  • అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకూ లేఖలు రాయనున్న సర్కారు
  • పార్టీ పేరిటే భూములు ఇచ్చేలా నూతన విధానం

జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను కట్టుకోవాలని భావించే అన్ని రాజకీయ పార్టీలకూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపరాఫర్ ఇచ్చారు. గజం భూమిని కేవలం రూ. 100కు ఇస్తామని చెబుతూ, గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు వీలుగా భూములను కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేసే పనిలో ఉన్న సర్కారు, అవి పూర్తి కాగానే అన్ని పార్టీలకూ లేఖలు రాయాలని భావిస్తోంది.

వాస్తవానికి టీఆర్ఎస్ కార్యాలయ భవనాల నిర్మాణం నిమిత్తం 28 ప్రాంతాల్లో ఎకరాకు మించకుండా భూములను ఇవ్వాలని మంత్రి మండలి గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే, కేవలం టీఆర్ఎస్ కు భూములిస్తే, విమర్శలు, అపవాదులు వస్తాయన్న కోణంలో ఆలోచించిన సర్కారు పెద్దలు, అన్ని పార్టీలకూ భూమిని ఇవ్వాలని భావిస్తున్నారు. గతంలో పార్టీ ఆఫీసులకు భూమిని ట్రస్టుల పేరిట కేటాయించగా, ఇకపై పార్టీ పేరిటే ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా రాజకీయ పార్టీలకు స్థలాలను కేటాయించేలా ఓ కొత్త పాలసీని చంద్రబాబు సర్కారు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News