Raja Kiran: జూనియర్ ఆర్టిస్టుపై నలుగురి అత్యాచారం అవాస్తవం... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాల వెల్లడి!

  • అత్యాచార కేసు వెనుక రాజా కిరణ్ మాస్టర్ ప్లాన్
  • డబ్బు పంపకాల్లో గొడవలు వచ్చినందునే స్నేహితుల మధ్య పరస్పర కేసులు
  • రాజా కిరణ్ వ్యభిచార దందాను సాగించాడన్న పోలీసులు

ఓ జూనియర్ ఆర్టిస్టును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లి నలుగురు అత్యాచారం చేశారని, దీని వెనుక ఆ ఆర్టిస్టు ఇద్దరు స్నేహితురాళ్ల ప్రమేయం ఉందని నిన్న వెలుగులోకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ అత్యాచారం అవాస్తవమని, దీని వెనుక రాజా కిరణ్ మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి రాజా కిరణ్‌, ఆరు సంవత్సరాల క్రితం, జూనియర్ ఆర్టిస్టుగా చెప్పుకుంటూ, హైదరాబాద్‌ వచ్చాడు. ఇతనికి నూజివీడు, పొన్నూరు నుంచి వచ్చిన ఇద్దరు యువతులు, ఆపై కొంత కాలానికి హైదరాబాద్ కు చెందిన మరో యువతి పరిచయం అయ్యారు.

శ్రీరెడ్డి వివాదం వెలుగులోకి వచ్చిన తరువాత, జూనియర్‌ ఆర్టిస్టుల అసోసియేషన్‌ పేరుతో ఓ సంస్థను ప్రారంభించిన రాజా కిరణ్, అప్పటికే తనకు పరిచయమున్న ఇద్దరు యువతులకు, మూడో యువతిని కూడా పరిచయం చేశాడు. మిగతా ఇద్దరికన్నా ఈమెతోనే అతను సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో అసోసియేషన్‌ లో సభ్యత్వం రూపేణా పలువురి నుంచి వసూలు చేసిన మొత్తంలో వాటాలు పంచుకునే విషయంలో వారి మధ్య గొడవలు వచ్చాయి. మొదటి ఇద్దరు యువతులూ వేర్వేరు యువకులతో ఉన్నప్పుడు దిగిన అసభ్య చిత్రాలు తనవద్ద ఉన్నాయని, ఫేస్‌ బుక్‌, వాట్స్ యాప్ లో వాటిని పోస్ట్ చేస్తానని కిరణ్ బెదిరించడంతో ఆ ఇద్దరు యువతులూ గతంలోనే లంగర్‌ హౌస్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే రాజా కిరణ్, మరో యువతి కలసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే తనను గుంటూరు తీసుకెళ్లి నలుగురు అత్యాచారం చేశారని, తనకు తెలిసిన స్నేహితురాళ్లే ఈ పని చేయించారని ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో రాజా కిరణ్ పై ఓ ఫిర్యాదు ఉన్న నేపథ్యంలో, దానికి కౌంటర్ గానే ఈ ఫిర్యాదు వచ్చిందని అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. రాజా కిరణ్ కాల్ డేటాను బయటకు తీశారు. వివిధ ప్రాంతాల నుంచి సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే వారిని ట్రాప్ చేసి, వారితో వ్యభిచారం చేయిస్తాడని, నగరంలోని 500 లాడ్జీల్లో రూములను ఆయన బుక్ చేశాడని గుర్తించారు. గురువారం రాజా కిరణ్ ను అరెస్ట్ చేశామని, నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టి, కస్టడీకి తీసుకుంటామని చెప్పారు.

More Telugu News