Telugudesam: లోక్‌సభలో మళ్లీ గళం విప్పిన గల్లా జయదేవ్..ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిందేనన్న ఎంపీ

  • లోక్‌సభలో మరోమారు కేంద్రాన్ని నిలదీసిన గల్లా
  • జీఎస్టీ వల్ల రాష్ట్రం దారుణంగా దెబ్బతింటోందన్న ఎంపీ
  • పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోమారు గళం విప్పారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గురువారం ఆయన సభలో మాట్లాడుతూ దేశం మొత్తానికి అండగా నిలుస్తున్న కేంద్రం ఏపీకి మాత్రం అన్యాయం చేస్తోందన్నారు. ఏపీ విభజన చట్టంలోని ఏ అంశాన్ని కూడా కేంద్రం నెరవేర్చడం లేదన్నారు. అశాస్త్రీయంగా విభజించిన ఏపీ అభివృద్ధికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందేనన్నారు.

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక విధానం అమలు చేస్తామన్న కేంద్రం ఆ ఊసే మర్చిపోయిందని గల్లా విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నట్టే ఏపీకి కూడా పన్ను రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ కారణంగా ఏపీ భారీగా నష్టపోతోందని పేర్కొన్నారు. ఏడాదికి ఏకంగా రూ.2600 కోట్ల నష్టం వస్తోందని, కేంద్రం కొంత మొత్తాన్ని భరిస్తున్నప్పటికీ నష్టం భర్తీ కావడం లేదని జయదేవ్ తెలిపారు. కేవలం ఐదేళ్లు మాత్రమే ఈ పరిహారం చెల్లిస్తుందని, మరి ఆ తర్వాత సంగతేంటని ఆయన ప్రశ్నించారు. 

More Telugu News