సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

10-08-2018 Fri 07:23
  • సినిమా యూనిట్ కి కీర్తి సురేశ్ కానుకలు!
  • రాజశేఖర్ సినిమాకి హీరోయిన్ కావాలట 
  • భారీ మొత్తంలో ఆర్జించిన ప్రియాంక 
  • స్క్రిప్టు పనిలో నితిన్ 'భీష్మ'
*  కొంతమంది స్టార్ హీరోలు తమ  సినిమా షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులకు కృతజ్ఞతా పూర్వకంగా కానుకలిస్తుంటారు. కథానాయిక కీర్తి సురేశ్ కూడా తన యూనిట్ సభ్యులకు అలాగే కానుకలిస్తోంది. ఆమధ్య 'మహానటి' చిత్రం యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా 'పందెంకోడి 2' చిత్రం షూటింగ్ చివరి రోజున యూనిట్లోని వారందరికీ గోల్డ్ కాయిన్స్ పంచి, వారి హృదయాలను గెలుచుకుంది.
*  డా.రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా కాజల్, శ్రియ వంటి పేర్లు వినిపించినా, ఇంతవరకు ఎవరూ ఖరారు కాలేదు. ప్రస్తుతం దర్శక నిర్మాతలు హీరోయిన్ వేటలో ఉన్నారట.
*  ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా గతేడాది భారీ మొత్తంలో ఆర్జించినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ సీరియల్ 'క్వాంటికో'తో పాటు పలు వాణిజ్య ప్రకటనల ద్వారా అమ్మడికి గత ఆర్ధిక సంవత్సరంలో సుమారు అరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట.
*  నితిన్ హీరోగా 'భీష్మ' పేరిట ఓ ప్రేమ కథా చిత్రం రూపొందనుంది. 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే నెలాఖరులో దీని షూటింగ్ మొదలవుతుంది.