consumar form: విజయవాడ మల్టీప్లెక్సులపై వినియోగదారుల ఫోరం కొరడా.. రూ.25 లక్షల జరిమానా!

  • విజయవాడలో అధిక ధరలపై ఫోరం ఆగ్రహం
  • బయటి ఆహారాన్ని అనుమతించాలని ఆదేశం
  • తెలుగులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మాధవరావు

ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ను అధిక ధరలకు అమ్ముతున్న విజయవాడ మల్టీప్లెక్స్ లకు అక్కడి వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఎల్ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీఐ, ఐనాక్స్ మల్టిప్లెక్స్ లకు రూ.5 లక్షలు చొప్పున రూ.25 లక్షల జరిమానా విధించింది. విజయవాడకు చెందిన ఓ వినియోగదారుడు దాఖలుచేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి మాధవరావు ఈ రోజు అందరికి అర్థమయ్యేలా తెలుగులో తీర్పు ఇచ్చారు. ఆహార పదార్థాల ధరలను డిస్ ప్లేలో ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ లకు వచ్చే ప్రజలు బయటి నుంచి ఆహార పదార్థాలు, నీళ్లు తెచ్చుకునేందుకు అనుమతించాలని వాటి యాజమాన్యాలను ఫోరం ఆదేశించింది. తమ ఆదేశాలు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలనీ, దీనికి సంబంధించిన నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని అధికారులకు ఫోరం స్పష్టం చేసింది. పిటిషనర్ నుంచి అదనంగా రూ.130 వసూలు చేసి మానసిక క్షోభకు గురిచేసినందుకు గానూ మొత్తం రూ.630 (అసలు ఫీజు 500)ను 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఐదు మల్టీప్లెక్స్ లపై విధించిన రూ.25 లక్షల జరిమానాను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఫోరం తీర్పు ఇచ్చింది.

More Telugu News