Rajya Sabha: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఘన విజయం!

  • 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ
  • ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
  • హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు.

అయితే, విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ బెల్ మోగించారు. హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 230 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్ నంబర్ బోర్డు తెలిపింది. ఆపై దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు.

తర్వాత కొంతమంది తాము పొరపాటు పడ్డామని, మరికొందరు ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి డివిజన్ చేశారు. అప్పుడు హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ గెలుపును వెంకయ్యనాయుడు ఖరారు చేయగా, ఆపై పలువురు సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News