Telangana: వ్యభిచార గృహాలను మూసేస్తున్నామంటూ సిద్దిపేటలో బోర్డు.. ఇటువైపు రావొద్దంటూ విటులకు హెచ్చరిక!

  • కోమటిచెరువులో రాత్రికి రాత్రే వెలసిన బోర్డు
  • వ్యభిచారం కోసం బలవంతం చేయవద్దని హెచ్చరిక
  • ఎంతలో ఎంతమార్పు అంటూ కొనియాడుతున్న జనం

సిద్దిపేటలోని కోమటి చెరువు సమీపంలో తాటికాయంత అక్షరాలతో వెలసిన బోర్డు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల యాదగిరి గుట్టలో వెలుగుచూసిన వ్యభిచార దందా తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించింది. యాదగిరి గుట్టతో సిద్దిపేటకు సంబంధాలు ఉన్నాయన్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. యథేచ్ఛగా సాగుతున్న అమ్మాయిల అక్రమ రవాణా, కిడ్నాప్ చేసి బాలికలను తీసుకొచ్చి యాదగిరి గుట్టలో అమ్మేయడం, వారు వయసుకు మించిన వారుగా కనిపించేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం తెలిసి అందరూ విస్తుపోయారు.

సిద్దిపేటలోనూ ఈ దందా జోరుగా నడుస్తోందన్న వార్తలు వచ్చాయి. పట్టణానికి సమపంలోని కోమటి చెరువులో ఈ దందా ఏళ్లుగా సాగుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇళ్లను అద్దెకు తీసుకుని మరీ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తేలడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే, ఇకపై ఇక్కడ అటువంటి పనులు నిర్వహించడం లేదని, వ్యభిచారాన్ని మానేశామంటూ కోమటిచెరువులో పెద్ద బోర్డు దర్శనమిచ్చింది. ఎవరైనా బలవంతం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న హెచ్చరిక కూడా ఉంది. కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్డు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. దీనిని చూసిన వారు 'ఎంతలో ఎంత మార్పు!' అంటూ ప్రశంసిస్తున్నారు. 

More Telugu News