China: ఇతర మతాలపై ఆంక్షలు.. చైనీయమే జిన్ పింగ్ అభి'మతం'!

  • అన్యమతస్థులపై ఉక్కుపాదం మోపుతున్న చైనా
  • దేశాన్ని పూర్తి గా చైనీయం చేయాలనే లక్ష్యం 
  • ముస్లింలు, క్రైస్తవులపై అడుగడుగునా ఆంక్షలు, దాడులు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్యమతాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఐదేళ్ళలో దేశాన్ని మొత్తం చైనీయం చేయాలనే ఆలోచనతో అన్య మతాలపై ఆంక్షలు పెడుతున్నారు. విదేశీ మతాలపై విరుచుకుపడుతున్న జిన్ పింగ్  కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో చైనాలో అన్య మతస్థులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. రహస్యంగా మత ప్రార్ధనలు చేసుకుంటున్నారు.

మావో జెడాంగ్ తర్వాత అంతటి బలమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్‌పింగ్ దేశంలో ఇతర మతాలను లేకుండా చేయాలని కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. మత స్వేచ్ఛకు కళ్ళెం వేసి, దేశాన్ని చైనీయం చేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చైనాలో జిన్ పింగ్ ప్రభుత్వం వీఘర్ ముస్లింలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇప్పుడు క్రైస్తవులపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు జిన్ పింగ్.

చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. అక్కడ ఉన్న క్రైస్తవులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిన్ పింగ్ దెబ్బకు చైనానుండి చాలామంది పాస్టర్లు అమెరికాకు పారిపోయారు. వేలాది హౌస్ చర్చ్‌లను మూసివేయించటంతో పాటు చర్చిలపై దాడులు చేస్తున్నారు చైనా అధికారులు. బైబిళ్ళను స్వాధీనం చేసుకుంటున్నారు. క్రైస్తవం ఆచరిస్తే కచ్చితంగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని ఆంక్ష పెట్టారు.

జీసస్ చిత్రపటానికి బదులు జిన్ పింగ్ ని ప్రార్థించమని ఒక చర్చిలో అధికారులు చెప్పారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవుల ఈ-కామర్స్ సైట్లను అధికారులు మూసివేయించారు. దీంతో చాలా మంది ప్రభుత్వ చర్యలకు భయపడుతున్నారు. కొందరు క్రైస్తవులు రహస్యంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భయం గుప్పిట్లో అన్యమతస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

More Telugu News