internet: ఇండియాలో ఇంటర్నెట్‌ వాడుతుంది 19 శాతం మంది మాత్రమేనట!

  • ఇంటర్నెట్ వాడకం తెలిసినవారు 35 శాతం.
  • 27 శాతం మంది సోషల్ మీడియా వాడుతున్నారు  
  • లెర్న్‌ఆసియా, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ల షాకింగ్ నివేదిక 

స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిన రోజులివి.. రోజులో ఎక్కువ భాగం సోషల్ మీడియాకే అంకితమైపోతున్న కాలమిది.. ప్రపంచం అంతా డిజిటలైజేషన్ లో పరుగులు పెడుతుంటే, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని అందరూ భావిస్తుంటే నమ్మలేని విషయం చెప్పింది లెర్న్ ఆసియా సంస్థ. మన ఇంటర్నెట్ వాడకం చూసి మనమే అవాక్కయ్యే నివేదికనిచ్చింది.

భారత దేశం ఇంటర్నెట్ వాడకంలో ముందు వరుసలోనే ఉంటుందని భావిస్తుంటే, 'అబ్బే అదేమీ లేదు. భారత్ లో ఇంటర్నెట్ వాడకం కేవలం 19 శాతం మాత్రమే' అని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇంటర్నెట్‌ వాడకంపై ప్రస్తుతం లెర్న్ ఆసియా నివేదిక సంచలనమే అయ్యింది. భారతదేశంలో 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కేవలం 19 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ వాడుతున్నారట. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 35 శాతం మందే ఇంటర్నెట్‌ తెలిసిన వారు ఉంటున్నారని తాజా రిపోర్టు నివేదించింది. ఇంటర్నెట్ వాడకం తెలిసిన 35 శాతం మందిలో 27 శాతం మంది మాత్రమే ఎక్కువగా సోషల్‌ మీడియాను వాడుతున్నారని పేర్కొంది.

'ఆఫ్టర్ యాక్సస్: ఐసీటీ యాక్సస్‌ అండ్‌ యూజ్‌ ఇన్‌ ఇండియా అండ్‌ ది గ్లోబల్‌ సౌత్‌' పేరుతో లెర్న్‌ఆసియా, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి నెట్ వాడకందార్ల రిపోర్టును ప్రచురించింది. భారత్‌లో ఇంటర్నెట్‌ వాడకం ఇంత  తక్కువగా ఉండటానికి  కారణాలను కూడా అందులో వివరించింది. భారత్‌లో ఇంటర్నెట్‌ గురించి అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య అని ఈ రిపోర్టు పేర్కొంది. ప్రపంచంలోనే భారత్ కు విస్తృతమైన భరించగలిగిన మార్కెట్ ఉన్నప్పటికీ అవగాహనాలేమివల్ల ఇంటర్నెట్ ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారని లెర్న్‌ఆసియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హిలాని గల్పాయా చెప్పారు. మొత్తానికి ఇంటర్నెట్ వాడకంలో మనం చాలా వెనుకబడి ఉన్నామని, సోషల్ మీడియాకు తప్ప దీనిని వేరేగా వినియోగించటం లేదన్నది ఈ నివేదిక సారాంశం.

More Telugu News