boeing: కాంగ్రెస్ మెడకు మరో బోఫోర్స్.. భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన కాగ్!

  • నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారు
  • కేంద్రం, రక్షణ శాఖ తప్పుచేశాయన్న కాగ్
  • బోయింగ్ కు మినహాయింపులు ఇచ్చారని వెల్లడి

కాంగ్రెస్ పార్టీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మరో షాక్ ఇచ్చింది. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి 8 పొసేడియన్ పీ-8ఐ సముద్ర నిఘా, గస్తీ విమానాలను కొనుగోలు చేసిందని వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

సముద్ర గస్తీ విమానాలకు ఆహ్వానించిన టెండర్లను ఖరారు చేయడంలో యూపీఏ ప్రభుత్వం, రక్షణ శాఖ పొరపాటు చేశాయని కాగ్ తెలిపింది. 8 నిఘా విమానాల కోసం బోయింగ్ సంస్థ రూ.8,700 కోట్లకు బిడ్డింగ్ వేయగా, యూరప్ కు చెందిన ఈఏడీఎస్ సంస్థ కేవలం రూ.7,776 కోట్లకే ఎనిమిది ఏ-139 విమానాలను సరఫరా చేస్తామని ముందుకు వచ్చిందని వెల్లడించింది.

అయితే రాబోయే 20 ఏళ్లకు ఈ విమానాలకు అందించాల్సిన సర్వీసింగ్ ఖర్చుల్ని ఈఏడీఎస్ బిడ్డింగ్ కు కలిపేసిన రక్షణ శాఖ.. బోయింగ్ కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చిందని ఆక్షేపించింది. తద్వారా ఈఏడీఎస్ బిడ్డింగ్ ఖర్చు రూ.8,712 కోట్లకు చేరుకుంది. దీంతో బోయింగ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుందని వెల్లడించింది. బోయింగ్ నుంచి కొనుగోలు చేసిన పీ-8 నిఘా విమానాలకు మూడేళ్ల పాటు సర్వీసింగ్ కు ప్రత్యేకంగా మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని పేర్కొంది.

సముద్రంపై నిఘాతో పాటు శత్రు దేశాల సబ్ మెరైన్లను వేటాడేందుకు మరో నాలుగు లాంగ్ రేంజ్ పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు 2013-15లో భారత నేవీ బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకుందని కాగ్ తెలిపింది.

More Telugu News