Chittoor District: ప్రొఫెసర్ల వేధింపులే ఈటెలై మనసును బాధించిన వేళ... డాక్టర్ శిల్ప ఆత్మహత్య వెనుక అసలు కారణం!

  • యువ వైద్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ శిల్ప
  • కావాలనే పీజీ పరీక్షల్లో ఫెయిల్ చేయించిన ప్రొఫెసర్
  • వేధింపులు తాళలేక మనస్తాపంతో ఆత్మహత్య
  • రూయా ఆసుపత్రి హెడ్ రవికుమార్ పై సస్పెన్షన్ వేటు

తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించి, యువ వైద్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో కలకలం రేపగా, పోలీసుల విచారణలో ఆమె ఆత్మహత్యకు రూయా ఆసుపత్రి హెడ్ డాక్టర్ రవికుమార్ కారణమని తేలింది. ఆమె మృతితో జూనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం కట్టలు తెంచుకోగా, రవికుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రొఫెసర్ల వేధింపులు ఆమె మనసును ఈటెల్లా బాధించాయని, ఆమెను కావాలనే పీజీ పరీక్షల్లో ఫెయిల్ చేయించడంతోనే ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగాయి.

తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లోనే తిరుపతికి చెందిన రూపేష్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, పట్టా తీసుకున్న తరువాత గవర్నమెంట్ డాక్టర్ గా ఎంపికై తంబళ్లపల్లిలో తొలుత సేవలందించింది. ఆపై పీడియాట్రిక్స్ లో ఎండీ కోర్సు చేసేందుకు సీటు రాగా, 2015-16లో రుయాలో చేరింది. పీజీ చేస్తున్న సమయంలో అక్కడి ప్రొఫెసర్లు రవికుమార్, కిరీటి, శశికుమార్ లు తనను వేధిస్తున్నారని సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ, గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసి, రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించింది. అప్పట్లో గవర్నర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ, విచారణ జరిపి, శిల్ప మానసిక స్థితి సరిగ్గా లేదంటూ భావించగా, ఆ విషయం తెలుసుకున్న ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది.

ఆ నివేదికను రహస్యంగా ఉంచడంతో పాటు ప్రొఫెసర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మేలో జరిగిన పీజీ పరీక్షల్లో శిల్ప విఫలమైంది. తనను కావాలనే ఫెయిల్ చేశారని ఇంట్లో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది కూడా. రీకౌంటింగ్ పెట్టించినా ఫెయిలైందనే రావడంతో వేదనను తట్టుకోలేక నిన్న ఆత్మహత్య చేసుకుంది. శిల్ప ఆత్మహత్య చేసుకునేంత పిరికి పిల్ల కాదని, ఆమె మరణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని బంధుమిత్రులు డిమాండ్ చేశారు. కాగా, శిల్ప ఆత్మహత్యపై నేడు ఓ విచారణ కమిటీ యూనివర్శిటీ క్యాంపస్ లో రహస్య విచారణ చేపట్టనుంది.

More Telugu News