karunanidhi: నాస్తికుడైన కరుణానిధిలో.. ఇది మరో కోణం!

  • ఆలయాల పునర్నిర్మాణాలకు రూ. 420 కోట్లు వెచ్చించిన కరుణ
  • ఎన్నికలకు ముందు, తర్వాత ఆలయాలను దర్శించిన దివంగత నేత
  • నేను నాస్తికుడినైనా.. ఇతరులపై ఆంక్షలు విధించనని చెప్పిన కరుణ

దివంగత కరుణానిధి నాస్తికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ద్రవిడ ఉద్యమంలో కీలక నేత అయిన పెరియార్ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ, కరుణానిధికి మతపరమైన సిద్ధాంతాలపై నమ్మకం లేదని తెలిపారు. అయితే, ఆయనకు సంబంధించిన ఓ విషయం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసేదే. వ్యక్తిగతంగా మత విశ్వాసాలు లేనప్పటికీ, కరుణానిధి ఆలయాల పోషకుడిగా మాత్రం ఉన్నారు. కొన్ని రిపోర్టుల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. తమిళనాట ఆలయాలను నిర్మించడం, జీర్ణ స్థితిలో ఉన్న ఆలయాలను పునర్నిర్మించడం వంటివి చేశారు. అంతేకాదు, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఆలయాల పునర్నిర్మాణాల కోసమే రూ. 420 కోట్లను మంజూరు చేశారు.

మరో విషయం ఏమిటంటే... కొన్ని దశాబ్దాలుగా కరుణానిధి నివాసం ఉన్న ఇల్లు శ్రీకృష్ణుడి ఆలయం పక్కనే ఉంది. అంతేకాదు, కరుణ ఇంటికి పూజారులు వస్తూ, పోతూ ఉండేవారు. ఓ సందర్భంగా కరుణ ఇంటిలో చేసిన పూజల వీడియో వైరల్ అయింది. దీంతో, కరుణపై విమర్శల వర్షం కురిసింది. నాస్తికుడినని చెప్పుకుంటూ, ఈ పూజలేంటని కొందరు బహిరంగంగానే విమర్శించారు.

దీనికి సమాధానంగా... 'నేను నాస్తికుడినే. కానీ డీఎంకే పార్టీ కానీ, నా చుట్టూ ఉన్నవారు కానీ నా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం లేదు. దైవత్వం విషయంలో పార్టీపై కానీ, ఇతరులపై కానీ ఎలాంటి ఆంక్షలు విధించను. నా కుటుంబసభ్యులపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎవరి నమ్మకాలు వారివే' అని కరుణ తెలిపారు. కరుణ నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువ ఇచ్చేవారు. అంతేకాదు, ఎన్నికలకు ముందు, తర్వాత పార్టీ ముఖ్య నేతలతో కలిసి కరుణ దేవాలయాలను సందర్శించేవారట. 

More Telugu News