Uttar Pradesh: సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డ యూపీ వాణిజ్య పన్నుల శాఖ అధికారి అరెస్ట్!

  • హోటల్‌లో పక్కపక్క గదుల్లోనే దిగిన అధికారి, బాధితురాలు
  • తనను కొట్టి అత్యాచారం చేశాడని ఆరోపణ
  • దర్యాప్తు చేస్తున్న అధికారులు

సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై నోయిడాలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌‌ వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారి పంకజ్ కుమార్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఆగస్టు 2 రాత్రి హోటల్‌లో తనపై అత్యాచారానికి పాల్పడిన అధికారి సోమవారం మరోమారు అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. తాను ఢిల్లీ వెళ్లాల్సి ఉందని మొత్తుకున్నా అతడు వినిపించుకోలేదని, హోటల్‌లో తనను నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.

వ్యక్తిగత పనుల నిమిత్తం వీరిద్దరూ కలసి ఓ రాజకీయ నాయకుడిని కలవడం కోసం భోపాల్ వచ్చి హోటల్ లో వేర్వేరు గదుల్లో దిగారు. ఈ సందర్భంగానే తనపై అత్యాచారం జరిగినట్టు నిందితురాలు భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి, బాధితురాలికి మధ్య 2010 నుంచి స్నేహం ఉందని, ఇద్దరూ సహోద్యోగులేనని పోలీసులు తెలిపారు. నిందితుడు తనపై దాడి కూడా చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండుకి పంపినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News