Karunanidhi: కరుణానిధి నల్ల కళ్లద్దాలే ఎందుకు పెట్టుకుంటారు?

  • ఆరు దశాబ్దాలుగా కంటికి అద్దాలతో కరుణ
  • ప్రమాదంలో ఎడమ కంటికి గాయం
  • వైద్యుల సూచన మేరకు నల్ల కళ్లద్దాలు

కరుణానిధి అనగానే కళ్లకు నల్ల కళ్లద్దాలు, ఒంటిపై పసుప పచ్చని శాలువ ధరించిన నిలువెత్తు రూపం చప్పున స్ఫురిస్తుంది. ఈ రెండూ లేకుండా ఆయన కనిపించడం అరుదనే చెప్పుకోవాలి. శాలువ సంగతి పక్కనపెడితే, నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరిస్తారనే విషయం చాలామందికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. అరవైయేళ్ల క్రితం కరుణానిధి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైంది. 

గాయం కారణంగా ఎడమ కన్ను అప్పుడప్పుడు వాచేది. మందులు వేసుకుంటే మళ్లీ మామూలు స్థితికి చేరేది. నల్ల కళ్లద్దాలు వాడితే కంటి సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచించారు. వారి సలహా మేరకు నల్ల కళ్లజోడు ధరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది అలవాటుగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన వాటిని చివరిశ్వాస విడిచే వరకూ ధరిస్తూనే ఉన్నారు. 

1953లో కరుణానిధి పరమకుడిలో ఓ సన్మానసభకు హాజరై తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. కంటికి తీవ్ర గాయమైంది. 1967లో మరోసారి జరిగిన ప్రమాదంలో ముఖానికి గాయమైంది. కన్ను బాగా వాపెక్కడంతో నొప్పి బాధించేది. దీంతో 1971లో అమెరికాలో కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు.   

More Telugu News