NIA: హైదరాబాద్ పాతబస్తీలో 'ఐఎస్ఐఎస్' సానుభూతిపరులు... ఎన్ఐఏ దాడులతో జనం బెంబేలు!

  • నిన్నటి నుంచి పాతబస్తీలో దాడులు
  • అబ్దుల్లా బాసిత్ కు సమన్లు ఇచ్చిన ఎన్ఐఏ
  • ఈ ఉదయం విచారణకు హాజరైన బాసిత్

హైదరాబాద్ పాతబస్తీలో అబూదాబీ మాడ్యూల్ ను బట్టబయలు చేసిన రెండేళ్ల తరువాత ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) మరోసారి సోదాలకు రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపించింది. పాతబస్తీ పరిధిలోని పలు ప్రాంతాలు, ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది వరుస దాడులు చేస్తున్నారు.

ఇరాక్, సిరియాలకు చెందిన జీహాదీలు హైదరాబాద్ యువకులతో సంబంధాలు పెట్టుకున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలో గతంలో ఉగ్రవాద సానుభూతిపరుడిగా ముద్రపడ్డ మొహమ్మద్ అబ్దుల్లా బాసిత్, మరో ఇద్దరిని విచారణకు రావాలని సమన్లు అందించగా, వారు ఈ ఉదయం బేగంపేటలోని ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చారు.

2015లో వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, ఏడాది క్రితం వీరికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఇక బాబానగర్ లోని బాసిత్, ఆయన సోదరి సనా ఇళ్లపై పోలీసులు సోదాలు జరిపారు. ఇదే సమయంలో బాసిత్ సహాయకులుగా భావిస్తున్న హనన్ ఖురేషి, ఒమల్ ఫారూఖ్, అద్నాన్, అబ్దుల్ ఖాదిర్ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. బాసిత్ బెయిల్ పై విడుదలైన తరువాత, కొంతకాలం సాధారణ జీవితం గడిపి, ఆపై తిరిగి ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఎన్ఐఏకు ఉప్పందినట్టు తెలుస్తోంది.

More Telugu News