Petrol: సుంకాలు లేకుంటే పెట్రోలు ధర రూ. 41.13... అసలు లెక్క ఇదే!

  • మళ్లీ రూ. 80ని దాటేసిన పెట్రోలు ధర
  • డీలర్ కు విక్రయించేది రూ. 37.52కే
  • సుంకాలన్నీ కలిపి భారీగా ధరను పెంచుతున్న వైనం

పెట్రోలు ధరలు మరోసారి రూ. 80ని దాటేశాయి. ఒక్క ఢిల్లీలో మాత్రమే రూ. 76.97గా ఉన్న లీటరు పెట్రోలు ధర, మిగతా అన్ని మెట్రో నగరాలలోను రూ. 80 నుంచి రూ. 85 వరకూ ఉంది. ఈ నేపథ్యంలో ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) వెబ్ సైట్ లో వెల్లడించిన పెట్రోల్ ప్రైస్ బిల్డ్ అప్ ప్రకారం, సుంకాలను తొలగిస్తే రూ. 41.13కే లీటరు పెట్రోలును విక్రయించవచ్చు.

బ్యారల్ ముడి చమురును దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి 82.28 డాలర్లు ఖర్చవుతుంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ సరాసరిన రూ. 68.72గా ఉందనుకుంటే...

డీలర్లకు పెట్రోలు విక్రయించే ధర లీటరుకు రూ. 37.52
ఎక్సైజ్ సుంకాలు రూ. 19.48
డీలర్ కమిషన్ రూ. 3.61
వ్యాట్ (డీలర్ కమిషన్ పై వ్యాట్ తో సహా) రూ. 16.36
రిటైల్ అమ్మకపు ధర (ఢిల్లీలో) రూ. 76.97.

ఐఓసీఎల్ తెలిపిన ఈ వివరాల ప్రకారం, పన్నులను... అంటే ఎక్సైజ్ సుంకాన్ని, విలువ ఆధారిత సుంకాన్ని తొలగిస్తే, లీటరు పెట్రోలు రూ. 41.13కే లభిస్తుంది. ఇందులో డీలర్ కమిషన్ రూ. 3.61 కూడా కలిపే ఉంటుంది. ఇక ఎక్సైజ్ సుంకాలు తగ్గించినా లేదా వ్యాట్ ను తీసేసినా రూ. 65కే పెట్రోలు లభిస్తుంది.

More Telugu News