children: మీ పిల్లలు అదే పనిగా ఫోన్ పట్టుకుంటున్నారా? అయితే ఇది మీకు హెచ్చరికే!

  • స్క్రీన్‌కు అతుక్కుపోయే వారిలో ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’
  • కళ్లు ఎండిపోయి జీవం కోల్పోయే ప్రమాదం
  • తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకుల హెచ్చరిక

పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి మురిసిపోయే తల్లిదండ్రులకు ఇది ఆందోళన కలిగించే అంశమే. ఎక్కువసేపు స్క్రీన్‌ను అంటిపెట్టుకుని ఉండే పిల్లల్లో కంటి చూపు తగ్గే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల కళ్లు జీవం కోల్పోవడాన్ని (ఎండిపోవడాన్ని) ఆఫ్తమాలజిస్టులు, ఫిజిషియన్లు గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్తమాలజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. దీంతో ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిల్లల కంటి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

1971 నుంచి ప్రపంచవ్యాప్తంగా హ్రస్వదృష్టి అంటువ్యాధిలా విస్తరిస్తోంది. 42 శాతం మంది అమెరికన్లు దీనితో బాధపడుతున్నారు. ఆసియా వ్యాప్తంగా 90 శాతం మంది టీనేజర్లు, పెద్దలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. అయితే, ఇన్నాళ్లూ దీనికి కారణం ఏంటనేది పరిశోధకులు కూడా చెప్పలేకపోయారు. తాజాగా జరిగిన అధ్యయనం ద్వారా ఈ విషయంపై స్పష్ట వచ్చింది. కంప్యూటర్, ఫోన్ల స్క్రీన్ లైటింగే దృష్టి లోపానికి కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు. దీనివల్ల కళ్లు ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’కు గురవుతాయని పేర్కొన్నారు. డిజిటల్ ఐ స్ట్రెయిన్ వల్ల కళ్లు ఎండిపోవడం, తలనొప్పి, చూపులో స్పష్టత లేకపోవడం, కళ్లపై ఒత్తిడి వంటివి బాధిస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ఆఫ్తామాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  

More Telugu News