తనపై కేసు పెట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్య జిత్!

07-08-2018 Tue 09:46
  • భారత్ తరఫున ఒలింపిక్స్ టీటీ ఆడిన సౌమ్య జిత్
  • అత్యాచార ఆరోపణలు చేసిన మైనర్ బాలిక
  • ఆమెనే వివాహమాడిన సౌమ్య జిత్

ఇండియా తరపున రెండు ఒలింపిక్స్‌ లో ప్రాతినిధ్యం వహించిన టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్య జిత్ ఘోష్. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో 58వ స్థానం వరకూ చేరి, భారత కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించాడు. అంత ఘనత సాధిస్తే ఏం... ఓ మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో చిక్కుకున్నాడు. దీంతో అతని జీవితం అల్లకల్లోలమై, మానసికంగా కుంగిపోయాడు. తిరిగి ఇప్పుడు తన సత్తా చాటాలన్న కృతి నిశ్చయంతో ఉన్న సౌమ్య జిత్, చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.

ఈ సంవత్సరం మార్చిలో 18 సంవత్సరాల యువతి, తనను సౌమ్యజిత్ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. ఆపై ఇండియాకు వస్తే తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో యూరప్ లో కొన్ని రోజులు ఉండి, మేలో ఇండియాకు వచ్చాడు. అతనికి తోటి ఆటగాళ్లు, టీటీ సమాఖ్య అండగా నిలిచింది. తాజాగా, అతను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు చెప్పాడు.

"నాలుగు నెలల క్రితం వచ్చిన ఆరోపణలపై ఎలా స్పందించాలో తెలియలేదు. అందరూ ఆమెకే మద్దతుగా నిలిచారు. ఆమె మైనర్ అన్నారు. నేను కూడా చిన్న పిల్లాడినే. మేమిద్దరమూ డేటింగ్ చేశాం. డేటింగ్ ప్రారంభించినప్పుడు నా వయసు కేవలం 22 సంవత్సరాలు. నాకిప్పుడు భవిష్యత్తు ముఖ్యం. తొందర్లోనే కేసు కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా. తిరిగి ఒలింపిక్స్ లో ఆడటమే నా లక్ష్యం" అని సౌమ్య జిత్ వెల్లడించాడు.