YSRCP: చంద్రబాబు గారు .. ఏమిటీ అమానుషం?: జగన్

  • అధికారం ఉందని కర్కశంగా వ్యవహరిస్తారా?
  • ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నాం
  • ట్విట్టర్ లో వైకాపా అధినేత వైఎస్ జగన్

"చంద్రబాబు గారూ... ఆడపడుచులపై ఏమిటీ అమానుషం? వారేం తప్పు చేశారు? అధికారం ఉంది కదా అని కర్కశంగా వ్యవహరిస్తారా?" అంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్, సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలను అణచివేసేందుకు పోలీసులు కటువుగా వ్యవహరించిన నేపథ్యంలో జగన్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"మహిళా పార్లమెంట్ ను విజయవాడలో నిర్వహించామని గొప్పలు చెప్పుకున్న మీరు, అదే విజయవాడలో అక్క చెల్లెమ్మల పట్ల ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు కాదా? వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం, దారుణం కాదా? ఈ ప్రభుత్వం సరిగ్గా వేతనాలు ఇవ్వకున్నా, 5 - 6 నెలలుగా సరుకుల బిల్లులు చెల్లించకపోయినా, 85 వేల మంది అప్పో, సొప్పో చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు.

అయినా సరే, దేశంలో ఎక్కడాలేని విధంగా భోజనం వండే పని నుంచి వారిని తొలగించి, ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించడానికి ఈ సర్కారు తహతహలాడుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజనం వండే పనిని అక్క చెల్లెమ్మలకే అప్పగిస్తాం. వారికి గౌరవవేతనం పెంచి అండగా ఉండటంతో పాటు పిల్లలకు పౌష్టికాహారం అందేలా భోజన ధరలు పెంచి, బిల్లులు సకాలంలో చెల్లిస్తాం" అని జగన్ వ్యాఖ్యానించారు.

More Telugu News