Tamilnadu: ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం.. ఆపై భయంతో నదిలో దూకి యువకుడి ఆత్మహత్య!

  • డ్రెంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకుడు
  • తల్లిదండ్రులను తీసుకురావాలన్న పోలీసులు
  • కేసు నమోదు చేస్తారన్న భయంతో ఆత్మహత్య

ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఓ యువకుడు ఆపై భయంతో నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బీసెంట్ నగర్‌కు చెందిన రాధాకృష్ణ శనివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడిని అడ్డుకున్న పోలీసులు బైక్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి వాటిని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రాధాకృష్ణ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. బైక్ తనది కాదని, తన స్నేహితుడిదని, తనను వదిలేయాలని బతిమాలాడు. అయినప్పటికీ వినిపించుకోని పోలీసులు తల్లిదండ్రులను తీసుకురావాల్సిందేనని తేల్చి చెప్పారు.

పోలీసుల హెచ్చరికలతో భయపడిన యువకుడు తనపై కేసు నమోదు చేస్తారేమోనని భావించాడు. దీంతో మనస్తాపంతో అక్కడే వంతెనపై నుంచి అడయారు నదిలోకి దూకేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు రోజుల గాలింపు అనంతరం సోమవారం ఉదయం రాధాకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

More Telugu News