agriculture: వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్నదే మా లక్ష్యం: కడియం శ్రీహరి

  • రైతు బీమా పథకం వరంగల్ లో ప్రారంభించిన కడియం
  • రైతులకు బీమా బాండ్ల పంపిణీ
  • కేసీఆర్ పాలనను రాష్ట్రపతి, ప్రధాని, కొనియాడారు

వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా పథకాన్ని ఆయన ప్రారంభించి, రైతులకు బీమా బాండ్లను అందజేశారు.

అనంతరం కడియం మాట్లాడుతూ, తెలంగాణలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, ఈ విధంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ‘తెలంగాణ’ ఒక్కటేనని అన్నారు. ఇది కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని అన్నారు.

గత నాలుగు సంవత్సరాలలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు-విత్తనాల కోసం రోడ్డెక్కిన పరిస్థితి లేదని, సకాలంలో రైతులకు కావాల్సిన విత్తనాలు-ఎరువులను అంచనా వేసి వాటిని అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. రూ.1000 కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక గోదాం చొప్పున మొత్తంగా 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించామని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఈ గోదాములలో నిల్వ చేసుకుంటే, ఆ పంటపై రుణాన్ని కూడా కల్పించే అవకాశం నేడు రైతుకు ఉందని చెప్పారు.

గతంలో వ్యవసాయానికి నీరు వాడితే నీటితీరువా వసూలు చేశారని, రైతుకు తెలంగాణలో ఇక ఈ పరిస్థితి ఉండకూడదని భావించిన కేసిఆర్, రూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలను రద్దు చేశారని, బకాయిలు రద్దు చేయడమే కాకుండా నీటి తీరువాలుండవని ప్రకటించిన ఘనత కూడా ఆయనదేనని ప్రశంసించారు.
రోహిణి కార్తె వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతు అప్పులు చేయడం, రైతును ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రైతు బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని కడియం శ్రీహరి అన్నారు. ఈ పథకం కింద ఏటా 12వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, ప్రతి పంటకు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు పంటలకు ప్రతి ఎకరాకు 8000 రూపాయలను రైతుకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని అన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకీ నేడు రైతు బీమా పథకం వర్తిస్తుందని, ఎకరం భూమి ఉన్న రైతు నుంచి వంద ఎకరాలున్న రైతుకు కూడా ఒకే రకమైన బీమా ఉంటుందని చె ప్పారు. ఒక్కో రైతు కోసం తెలంగాణ ప్రభుత్వం 2271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తుందని, ఈ బీమాపథకం కింద నేడు రైతులకు బాండ్లను అందించడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను ఈ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కడియం శ్రీహరి మొక్కలు నాటారు.

More Telugu News