USA: అమెరికాలో షాపింగ్ మాల్ ముందు కూలిన విమానం.. ఐదుగురి మృతి!

  • కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతా అనా సిటీలోని సౌత్ కోస్ట్ ప్లాజా షాపింగ్ సెంటర్ వద్ద ప్రమాదం 
  •  ఎమర్జన్సీ ల్యాండింగ్ సమయంలో  కుప్పకూలిన విమానం 
  •  విమానంలోని ఐదుగురి దుర్మరణం

అమెరికాలోని ఓ మాల్ ముందు విమానం కుప్పకూలగా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కాలిఫోర్నియా రాష్ట్ర పరిధిలోని శాంతా అనా సిటీలోని సౌత్ కోస్ట్ ప్లాజా షాపింగ్ సెంటర్ ముందు జరిగింది. రెండు ఇంజన్ లున్న చిన్న విమానం అదుపుతప్పి, మాల్ పార్కింగ్ స్పేస్ లో క్రాష్ అయిందని సిటీ న్యూస్ సర్వీస్ పేర్కొంది. ఈ ఘటనలో విమానంలోని ఐదుగురు మరణించారు.

వెంటనే ప్రమాద స్థలికి మెడికల్ టీమ్ ను పంపడం జరిగిందని, ఆరంజ్ కౌంటీ ఫైర్ అధారిటీ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మాల్ వద్ద వున్న వారెవరైనా గాయపడిందీ లేనిదీ తెలియరాలేదు. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా నడుస్తున్న ఓ కంపెనీ పేరిట రిజిస్టర్ అయిన ఈ విమానం గాల్లో ఉన్న వేళ, ప్రమాదాన్ని గుర్తించిన పైలట్, ఎమర్జెన్సీ లాండింగ్ కు అనుమతి కోరాడని, ఆపై దానికి జాన్ వేనీ ఆరంజ్ కౌంటీ ఎయిర్ పోర్టు అనుమతినివ్వగా, దానికి సమీపంలోని మాల్ వద్ద కూలిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

More Telugu News