Akhilesh yadav: జర్నలిస్టులు సహా అందరికీ అఖిలేశ్ యాదవ్ బంపరాఫర్.. వారిని గుర్తిస్తే రూ.11 లక్షల బహుమానం!

  • అఖిలేశ్‌పై అధికారిక బంగ్లా ఆస్తులను ధ్వంసం చేశారన్న ఆరోపణలు
  • కొందరు వ్యక్తులు కావాలనే భవనాన్ని ధ్వంసం చేశారన్న అఖిలేశ్
  • నిందితులను గుర్తించిన వారికి భారీ నజరానా!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బంపరాఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నివసించిన అధికారిక బంగ్లా ధ్వంసం వివాదంపై స్పందించిన అఖిలేశ్ నిందితులను గుర్తించిన వారికి రూ.11 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జర్నలిస్టులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. గత ఎన్నికల్లో అఖిలేశ్ ఓడిపోయినప్పటికీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలతో ఎట్టకేలకు ఆయన తన నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే, అధికారిక బంగ్లా ఆస్తులను ఆయన ధ్వంసం చేశారన్న ఆరోపణలున్నాయి.

ఈ ఆరోపణలపై మాజీ సీఎం తాజాగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మిశ్రా జయంతి వేడుకల్లో పాల్గొన్న అఖిలేశ్ మాట్లాడుతూ.. తాను బంగళాను ఖాళీ చేసిన తర్వాత కొందరు వ్యక్తులు సుత్తులు, గొడ్డళ్లతో వెళ్లి భవనాన్ని ధ్వంసం చేస్తూ, దానిని చిత్రీకరించారని ఆరోపించారు. అది చూపించి ఆ తర్వాత తనపై నింద మోపారని అన్నారు. ఈ ఘటన వెనక ఉన్న అసలైన నిందితులను గుర్తిస్తే రూ.11 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. జర్నలిస్టులకు కూడా ఈ బహుమతి వర్తిస్తుందని పేర్కొన్నారు.  

More Telugu News