Ganta Srinivasa Rao: అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభం.. నిధుల విషయంలో గంటా-జవదేకర్ మాటామాట!

  • రాష్ట్రంలోని కేంద్ర విద్యాసంస్థలకు నిధులివ్వాలన్న గంటా
  • ఇప్పటికే బోలెడన్ని ఇచ్చామన్న కేంద్రమంత్రి
  • ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్న గంటా

ఆంధప్రదేశ్‌కు అందిస్తున్న నిధుల విషయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం జరిగింది. జవదేకర్ ఆదివారం అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ జాతీయ విద్యాసంస్థలకు కేంద్రం నిధులివ్వాలని కోరారు. అనంతరం జవదేకర్ మాట్లాడుతూ.. కేంద్రం నిధులివ్వడం లేదన్నది అవాస్తవమని, రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఇప్పటి వరకు రూ.3600 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.

ఆ తర్వాత గంటా విలేకరులతో మాట్లాడుతూ నిధుల విషయంలో కేంద్రం అబద్ధాలు చెబుతోందని, దమ్ముంటే ఏ సంస్థకు ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏడు యూనివర్సిటీలు కేటాయించారని, అందులో ఆరు భూమి పూజకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ఒక్కదానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించి, నిధులు ఖర్చుచేస్తున్నా కేంద్రం గత నాలుగేళ్లలో పది శాతం నిధులు కూడా మంజూరు చేయలేదని పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. పొత్తుతో తమకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిసినా, గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

వర్సిటీ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి జవదేకర్ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థలకు నూటికి నూరు శాతం నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే రూ.3600 కోట్లు ఇచ్చినట్టు చెప్పిన ఆయన దేశ చరిత్రలోనే ఇలా మరే రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. రెండో దశలో మరో రూ.500 కోట్లు ఇస్తామని తెలిపారు. ఏపీకి కేంద్రం రూ.600 కోట్లే ఇచ్చిందన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు.  

More Telugu News