jagan: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10 వేల పెన్షన్ ఇస్తాం: జగన్

  • పోలవరం కాంట్రాక్టర్ యనమల వియ్యంకుడే
  • అధికారంలోకి వచ్చాక అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం
  • రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతోంది

రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతోందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని... ఈ మైనింగ్ అవినీతిలో పెదబాబు, చినబాబులకు వాటాలున్నాయని ఆరోపించారు. మంత్రి యనమల వియ్యంకుడు పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ అని... పోలవరంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని అన్నారు.

రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో పారిశుద్ధ్య కాంట్రాక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు భాస్కరనాయుడు దక్కించుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలను మరిచిపోయారని విమర్శించారు. కత్తిపూడిలో జగన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను సంస్కరిస్తామని, ప్రైవేట్ స్కూలు ఫీజులను నియంత్రిస్తామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినా... మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని జగన్ మండిపడ్డారు. 17 మంది ఎమ్మెల్యేలతో ఈ జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించారు. 

More Telugu News