nedurumalli janardhan reddy: బీజేపీకి షాక్ ఇచ్చిన నేదురుమల్లి కుమారుడు.. జగన్ తో భేటీ

  • రామ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా నిన్ననే ప్రకటించిన బీజేపీ
  • ఒక్క రోజు కూడా తిరక్కుండానే ఈరోజు జగన్ ను కలిసిన రామ్ కుమార్
  • వెంటకగిరి టికెట్ ను ఆశిస్తున్న నేదురుమల్లి కుమారుడు

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా రామ్ కుమార్ ను నిన్ననే ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడి ఒక్కరోజు కూడా తిరక్కుండానే... ఊహించని విధంగా వైసీపీ అధినేత జగన్ తో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను రామ్ కుమార్ కలిశారు.

2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రామ్ కుమార్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత భారత ఉపరాష్ట్రపతి, నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడుకి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2019లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేయాలని ఆయన భావిస్తూ వచ్చారు. కానీ, బీజేపీ, టీడీపీలు వేరుపడటంతో ఆయన అసహనానికి గురయ్యారు. ఒకానొక సమయంలో టీడీపీ వైపు కూడా మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ఆయనకు రాష్ట్ర కార్యదర్శి పదవిని ప్రకటించింది.

కానీ, చివరకు ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిశారు. అయితే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే జగన్ ను రామనారాయణ రెడ్డి కొన్ని సార్లు కలిశారు. ఈ నేపథ్యంలో, టికెట్ ను జగన్ ఎవరికి ఇస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మనకు అందుతున్న వివరాల ప్రకారం... తొలుత వైసీపీలో రామ్ కుమార్ రెడ్డి చేరుతారని... ఆ తర్వాత తుది నిర్ణయం జగన్ తీసుకుంటారని తెలుస్తోంది. 

More Telugu News