Mallikarjun: 'కరక్కాయల' స్కాం నిందితుడి నుంచి రూ. 40.95 లక్షలు స్వాధీనం!

  • అమాయకుల నుంచి కోట్లు దండుకున్న మల్లికార్జున్
  • మొత్తం ఆరుగురి అరెస్ట్
  • మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్న సజ్జన్నార్

హైదరాబాద్ లో అమాయకుల నుంచి కరక్కాయల పొడి పేరిట కోట్లాది రూపాయలు దండుకున్న నేరగాడు ముప్పాల మల్లికార్జునను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 1000 పెట్టి కరక్కాయలను తమ వద్ద కొనుక్కొని వాటిని పొడి చేసి ఇస్తే, రూ. 1300 ఇస్తామని చెప్పి, సుమారు 650 మంది నుంచి రూ. 2.39 కోట్లను ఇతను స్వాహా చేశాడని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జన్నార్ మీడియాకు తెలిపారు. మల్లికార్జునతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, ఇంకో ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. నిందితుల నుంచి రూ. 40.95 లక్షల నగదు, 11 సెల్ ఫోనులు, ఓ కారు, కరక్కాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తూ, నెల్లూరు జిల్లా అంబాపురంకు చెందిన మల్లికార్జున (36), 'పైన్ మిత్ర డాట్ కామ్' పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి తన దందాకు తెరలేపాడు. రూ. 1500 డిపాజిట్ చేసి, తమ ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రూ. 3 వేలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. నెల్లూరులోని తన స్నేహితులైన మాటూరి దేవరాజ్‌ అనిల్‌కుమార్‌, పెనుగొండ జగన్మోహన్‌రావు, గుండపనేని సురేంద్ర, తిన్నలూరు మహేష్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నోటి చిరంజీవిరెడ్డిలకు తన ప్లాన్ చెప్పి, కేపీహెచ్బీ కాలనీలో ఆఫీస్ ను సాఫ్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ టూల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ప్రారంభించాడు.

ఫిబ్రవరిలో పేపర్లు, టీవీ చానళ్లలో తన ఆఫర్ పై ప్రచారం చేశాడు. మొత్తం 81 టన్నుల కరక్కాయలను కొనుగోలు చేశాడు. మహిళలకు మాత్రమే అవకాశమంటూ అమాయకులను టార్గెట్ చేశాడు. మల్లికార్జున ప్లాన్ ఫలించింది. లక్షల్లో సొమ్ము వస్తుండటంతో తొలుత ఇస్తానన్న కమీషన్ ను సక్రమంగానే ఇచ్చాడు. దీంతో విషయం ఆనోటా, ఈనోటా పాకి పదుల సంఖ్యలో ఉన్న కస్టమర్లు వందల సంఖ్యలోకి పెరిగారు.

కొంతమంది ఏకంగా లక్షలు పెట్టి అతని వద్ద కరక్కాయలు కొన్నారు. జూన్ రెండో వారం నుంచి కమీషన్లు ఇవ్వడాన్ని సంస్థ నిలిపివేయగా, కొందరు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం దందా వెలుగు చూసింది. కస్టమర్ల నుంచి రూ. 8.17 కోట్లను వసూలు చేసిన మల్లికార్జున టీమ్ అందులో నుంచి 5.85 కోట్లను కమిషన్ కింద ఇచ్చిందని సజ్జన్నార్ తెలిపారు. వీరిపై పీడీ చట్టం కింద కేసు పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.

More Telugu News