APSRTC: ఏపీలో విచిత్రం... ఆర్టీసీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తున్న టీడీపీ, వైసీపీ!

  • ఆర్టీసీ ఎన్నికల్లో తిరుగులేని ఎన్ఎంయూ
  • దెబ్బతీసేందుకు రంగంలోకి దిగిన ఈయూ
  • ఈయూలో భాగంగా టీడీపీ కార్మిక పరిషత్, వైసీపీ వైఎస్ఆర్ ఆర్టీసీ

ఇదో విచిత్రమైన పొత్తు. రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఎంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్)ను ఓడించేందుకు టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్, వైసీపీ అనుబంధ వైఎస్ఆర్ ఆర్టీసీ ఏకమయ్యాయి. వీరితో పాటు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కూడా కలసి వచ్చింది. రాజకీయాల్లో భాగంగా నిత్యమూ కత్తులు దువ్వుకునే టీడీపీ, వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, కార్మిక సంఘాల విషయానికి వచ్చే సరికి ఈ రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తుండటం చాలా ఆసక్తిని కలిగిస్తోంది. టీడీపీకి అనుబంధంగా ఉన్న టీఎన్టీయూసీ (తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌)కు అనుబంధంగా కార్మిక పరిషత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆర్టీసీలో కార్మిక పరిషత్ బలం తక్కువ. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సైతం గత ఎన్నికల్లో ఎన్ఎంయూకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆర్టీసీలో బలమైన ట్రేడ్ యూనియన్ గా ఎదగాలన్న పట్టుదలతో ఉన్న కార్మిక పరిషత్, తన ఉనికిని విస్తరించుకుంటూ వచ్చింది. స్వతంత్ర సంఘంగా ఉన్న ఎన్ఎంయూకు చెందిన ఎంతో మందిని తమవైపు లాక్కుంది.

గతంలో ఓ మారు కార్మిక పరిషత్ ను, ఎన్ఎంయూను విలీనం చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఎన్ఎంయూ ఉంటుందన్న ఆలోచనలో ఉన్న టీడీపీ నేతలు, ఆ సంఘాన్ని పూర్తిగా విశ్వసించలేమన్న భావనతో విలీనం ఆలోచనలకు స్వస్తి పలికారు. ఇక ఆర్టీసీ ఎన్నికల్లో ఓట్లను సంపాదించడంలో చాలా వెనుకబడివున్న వైఎస్ఆర్ ఆర్టీసీ ఈ దఫా ఎన్నికల్లో కార్మిక పరిషత్ కు కాస్తయినా అండగా నిలవాలని భావిస్తోంది.

ఈ పొత్తుపై అధికారిక ప్రకటన లేకున్నా, తాము ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) తో పొత్తు పెట్టుకున్నామని, ఈయూలో వైఎస్ఆర్ ఆర్టీసీ ఒక భాగమేతప్ప, తామేమీ వైసీపీతో పొత్తు పెట్టుకోలేదని కార్మిక పరిషత్‌ ప్రధానకార్యదర్శి వి.వరహాల నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News