Himadas: గోల్డెన్ గాళ్ హిమదాస్‌కు ఆయిల్ ఇండియా భారీ నజరానా!

  • భారత్‌కు తొలి స్వర్ణం తీసుకొచ్చిన స్ప్రింటర్ 
  • స్ప్రింటర్ హిమదాస్‌కు రూ.20 లక్షల నగదు బహుమతి
  • ముఖ్యమంత్రి సహా మరెందరో ఆర్థిక సాయం

ప్రపంచ అండర్-20 చాంపియన్‌‌షిప్‌లో బంగారు పతకం కొల్లగొట్టిన స్ప్రింటర్ హిమదాస్‌పై నజరానాల వర్షం కురుస్తోంది. ఫిన్‌ల్యాండ్‌లో జరిగిన 400 మీటర్ల ఈవెంట‌్‌లో 51.46 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న హిమదాస్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇప్పటికే రూ.50 లక్షల నజరానా ప్రకటించగా, తాజాగా ఆయిల్ ఇండియా రూ.20 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈ మేరకు ఆయిల్ ఇండియా సీఎండీ ఉత్పల్ బోరా ప్రకటించారు. అంతేకాక,  ఒలింపిక్స్‌తో సహా రానున్న అన్ని టోర్నమెంట్‌ల కోసం అవసరమైన ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. మరోవైపు హిమదాస్ ప్రతిభకు మెచ్చిన మహింద్రా గ్రూప్స్ యజమాని ఆనంద్ మహింద్రా ఇప్పటికే ఆమెకు అండగా నిలిచారు. హిమను ఒలింపిక్ వేదికపై చూడాలనేది తన కల అని పేర్కొన్న ఆయన అందుకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు.  

కాగా, ఆయిల్ ఇండియా సీఎండీ మాట్లాడుతూ హిమదాస్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. అసోం నుంచే వచ్చే క్రీడాకారులకు నెలకు రూ.17 వేల స్కాలర్‌షిప్ అందిస్తున్నట్టు చెప్పారు. స్కాలర్‌షిప్ అందుకుంటున్న వారిలో అండర్-19 ప్రపంచకప్ క్రికెటర్ రియాన్ పరాగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి త్రిషా గొగోయ్ తదితరులు ఉన్నారు. తదుపరి టోర్నీల్లో పాల్గొనేందుకు కూడా వీరికి అవసరమైన సాయం అందిస్తామని ఉత్పల్ బోరా తెలిపారు. 

More Telugu News