Baby Spa: ఇండియాలో తొలి బేబీ స్పా... హైదరాబాద్ లో ప్రారంభం

  • పిల్లల కోసం హైడ్రో థెరపీ, మసాజ్
  • ప్రారంభించిన మహిళా ఔత్సాహికురాలు స్వాతి
  • చిన్నారుల్లో మానసికోల్లాసానికే!

ఇండియాలో మొట్టమొదటిసారిగా చిన్న పిల్లల కోసం తొలి స్పా హైదరాబాద్ లో ప్రారంభమైంది. దైనందిన జీవితంలో నిత్యమూ పని ఒత్తిడితో అలసిపోతే, పెద్దలు ఎలాగైతే వారాంతం కోసం వేచి చూస్తుంటారో, చిన్న పిల్లలలోనూ అటువంటి ఒత్తిడే ఉంటుందట. హైడ్రో థెరపీ, మసాజ్, వ్యాయామంతో చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని గుర్తించిన కొల్లా స్వాతి అనే ఔత్సాహికురాలు హైదరాబాద్ లో ఓ బేబీ స్పాను ప్రారంభించారు. చిన్నారుల్లో మానసిక ఉల్లాసం, వారి వృద్ధికి ఈ స్పా దోహదపడుతుందని, ఇక్కడ ఎన్నో రకాల స్పా సేవలను పిల్లల కోసం అందుబాటులోకి తెచ్చామని ఆమె చెబుతున్నారు.

"నెలల శిశువులకు ఈ స్పా ప్రత్యేకమైనది. తొమ్మిది నెలల వయసు వరకూ ఉన్న వారికి ప్రత్యేక సేవలను అందిస్తాం. తల్లి గర్భంలో ఉన్న సమయంలో వారు అనుభవించి అనుభూతి చెందే సహజ పరిస్థితులను కల్పించాం. వారు లేచి నిలబడలేరు కాబట్టి, పడుకుని ఉంటూనే చేసే వ్యాయామం ఇంక్కడ అందుబాటులో ఉంది" అని కొల్లా స్వాతి తెలిపారు. ఇక్కడికి వచ్చే వారికి స్విమ్ నాపీ, స్విమ్ సూట్ ఇచ్చి ఈత కొట్టిస్తామని, చిన్నారి తల నీటిలో మునగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇలా పిల్లలు నీటిపై తేలడం వల్ల వారు మానసికోల్లాసాన్ని పొందుతారని తెలిపారు. వారిలో సులువుగా నేర్చుకునే మానసిక సామర్థ్యం పెరుగుతుందని, మరింత వేగంగా పెరుగుతారని ఆమె వెల్లడించారు.

More Telugu News