Imran khan: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం వాయిదా.. ఈ నెల 14న చేసే అవకాశం!

  • ఈనెల 11న జాతీయ అసెంబ్లీ తొలి సమావేశం
  • 14 లేదంటే 15న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం
  • వెల్లడించిన ఆపద్ధర్మ మంత్రి

ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. జాతీయ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. నిజానికి ఈ నెల 11న పాక్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడది వాయిదా పడింది. ఈనెల 14 లేదంటే 15 తేదీల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఆపద్ధర్మ న్యాయశాఖ మంత్రి అలీ జాఫర్ పేర్కొన్నట్టు ‘డాన్’ పత్రిక పేర్కొంది.  

డాన్ పత్రిక కథనం ప్రకారం.. ఈనెల 11 లేదంటే 12న నేషనల్ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తారు. 11న కనుక అసెంబ్లీ సమావేశం అయితే ఇమ్రాన్ 14న ప్రమాణం చేస్తారు. 12న సమావేశమైతే కనుక 15న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే కొత్త ప్రభుత్వం తన పని ప్రారంభించాలని కోరుకుంటున్నట్టు అలీ జాఫర్ తెలిపారు. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికలు జరిగిన అనంతరం 21 రోజుల్లోపు జాతీయ అసెంబ్లీ సమావేశం జరగాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఈ నెల 15 వరకు సమయం ఉంది. కాబట్టి ఆ లోపు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది.  

More Telugu News