Tamilnadu: పురిటి నొప్పులతో కోడలు విలవిల.. ఇంటికొచ్చిన వైద్యులను అడ్డుకున్న భర్త, అత్తమామలు!

  • కోడలికి ఇంట్లోనే పురుడు పోసే ప్రయత్నం
  • ఇంటికొచ్చిన వైద్యులను అడ్డుకున్న వైనం
  • అత్తమామలు, భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు

పురిటి నొప్పులతో బాధపడుతున్న కోడలికి వైద్య సాయం అందించేందుకు ఇంటికొచ్చిన వైద్యులును భర్త, అత్తమామలు కలిసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తేని జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కన్నన్ (27) భార్య పురిటి నొప్పులతో బాధపడుతోంది. అయితే, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులు ఇంట్లోనే పురుడుపోయాలని భావించారు. అందుకోసం ఏర్పాట్లు చేశారు. ఇది గమనించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైద్య సిబ్బందితో కలిసి వారింటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన పోలీసులు, వైద్య సిబ్బందిని కన్నన్ తల్లిదండ్రులు ధనుష్కోడి-అళగమ్మాల్‌లు అడ్డుకున్నారు.

వారితో వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య సాయం అందించడానికి వీల్లేదని, తమ ఇంట్లో అందరూ ఇలానే పురుడుపోసుకున్నారని గొడవ పెట్టుకున్నారు. అలా చేయడం వల్ల తల్లీబిడ్డల ప్రాణాలకు హాని జరుగుతుందని చెప్పినా వినిపించుకోలేదు. వారికొచ్చిన ప్రమాదం ఏమీలేదని, డెలివరీ సక్రమంగానే జరుగుతుందంటూ పోలీసులతో వాదనకు దిగారు. తామంతా ఇంట్లోనే పుట్టామని, అందరం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆసుపత్రుల్లోనూ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయని పేర్కొన్నారు. తన భార్య డెలివరీ అయ్యాక ఎటువంటి ఇబ్బంది లేకుండా  ఇంటి పనులు చేసుకుందని ధనుష్కోడి పోలీసులతో గొడవపెట్టుకున్నాడు.

కొన్ని గంటలపాటు వాగ్వాదం జరిగిన తర్వాత ఎట్టకేలకు సిద్ధ వైద్య పద్ధతిలో మాత్రమే వైద్యం చేయడానికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో అప్పటికప్పుడు అక్కడికి చేరుకున్న సిద్ధ వైద్యుడు డెలివరీ చేశారు.

అనంతరం కోడలు మహాలక్ష్మి ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు గాను ధనుష్కోడి దంపతులతోపాటు కన్నన్‌ను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఇకపై  ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. కాగా, గత నెలలో తిర్పూరు జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి పురుడుపోసేందుకు ప్రయత్నించడంతో 28 ఏళ్ల మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆమె భర్త, ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. 

More Telugu News