Bihar: బీహార్‌లో బహిరంగ లేఖల యుద్ధం.. అధికార-ప్రతిపక్షాల మధ్య లేఖాస్త్రాలు!

  • ముజఫర్‌పూర్ ఘటనపై సీఎంకు తేజస్వీ లేఖ
  • ప్రతిగా రబ్రీకి లేఖ రాసిన జేడీయూ మహిళా నేతలు
  • కొడుకును మంచిగా పెంచడంలో విఫలమయ్యారని విమర్శ

బీహార్‌లో ఇప్పుడు లేఖల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాల నేతలు లేఖలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గత నెలలో ముజఫర్‌పూర్‌లో వెలుగుచూసిన బాలికలపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. 40 మంది బాలికలపై అత్యాచారం జరగ్గా, ఓ అమ్మాయిని అత్యాచారం అనంతరం చంపి పాతిపెట్టేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంలో నితీశ్ ప్రభుత్వం అనుసురిస్తున్న వైఖరికి నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సీఎం నితీశ్‌ కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు.

తేజస్వీయాదవ్ రాసిన బహిరంగ లేఖకు కౌంటర్‌గా జేడీయూ మహిళా నేతలు కూడా రంగంలోకి దిగారు. ఆ పార్టీకి చెందిన అంజుం ఆరా, శ్వేతా విశ్వాస్‌, భారతీ మెహతాలు కలిసి లాలు సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి లేఖ రాశారు.  తేజస్వీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అతడి వద్ద పనిచేస్తున్న పీఏ మణిప్రకాశ్ యాదవ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని లేఖలో సూచించారు.

మహిళల అక్రమ రవాణా కేసులో అతడు నిందితుడని, అటువంటి వ్యక్తి తేజస్వీ వద్ద పీఏగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అతడి వల్ల తేజస్వీ కూడా పక్కదారి పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇటువంటి వాళ్లను పీఏగా ఎలా నియమించుకుంటారని, ఓ స్త్రీగా మీరు కూడా ఆలోచించాలని అందులో సూచించారు. కొడుకు పక్కదారి పట్టకముందే అతడిని సక్రమ మార్గంలోకి మళ్లించాలని రబ్రీదేవికి సూచించారు. కొడుకును సక్రమంగా పెంచడంలో విఫలమయ్యారని పేర్కొన్న జేడీయూ మహిళా నేతలు ఇకనైనా అతడికి సద్గుణాలు నేర్పాలని సూచించారు.  

More Telugu News