USA: వచ్చే ఏడాది అంతరిక్షంలోకి అమెరికా వ్యోమగాములు.. సునీతా విలియమ్స్ కూ చాన్స్!

  • జనవరిలో అమెరికా అంతరిక్ష యాత్ర
  • 9 మందిని ఎంపిక చేసిన నాసా
  • జాబితాలో సునీతా విలియమ్స్

అమెరికా.. గత 70 ఏళ్లుగా ప్రపంచంపై అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయిస్తున్న దేశం. సంపద కావొచ్చు. సైన్యం కావొచ్చు. అంతరిక్షం కావొచ్చు.. ఏ రంగమైనా ఆ దేశానిదే ఆధిపత్యం. అయితే గత ఏడేళ్లుగా అమెరికా తన స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో తాము వచ్చే ఏడాది 9 మంది వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపుతామని నాసా ప్రకటించింది. వీరిలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. హూస్టన్ లోని జాన్సన్ స్పేస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు.

ప్రైవేటు స్పేస్ కంపెనీలు బోయింగ్, స్పేస్ ఎక్స్ లు అభివృద్ధి చేసిన స్టార్ లైనర్, డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వచ్చే ఏడాది జనవరిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపుతామని నాసా చెప్పింది. 1972లో ప్రారంభించిన స్పేస్ షటిల్ ప్రాజెక్టు 2011లో ముగిసిపోవడంతోనే అమెరికా భూభాగం నుంచి ఇప్పటివరకూ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపలేకపోయామని వెల్లడించింది.తాజాగా తాము అందించిన సహకారంతో స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలు కొత్త తరం అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేశాయని నాసా తెలిపింది.

ఈ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి జోష్ కస్సాడా(45) తో కలసి స్టార్ లైనర్ నౌక ద్వారా 2019 ప్రారంభంలో ఐఎస్ఎస్ కు వెళతారని నాసా ప్రకటించింది. గతంలో 321 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన సునీత.. 2012లో భూమిపైకి తిరిగివచ్చారు. మరోవైపు బెహ్న్ కెన్, హర్లీ అనే ఇద్దరు వ్యోమగాములు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ ఎక్స్ రాకెట్ ను నడుపుతారని నాసా వెల్లడించింది.

ఈ అంతరిక్ష నౌకల సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో వీటిని మానవరహితంగా ప్రయోగిస్తామని బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రకటించాయి. అంతేకాకుండా ప్రమాద సమయంలో వ్యోమగాములు రాకెట్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు అవసరమైన అబార్ట్ వ్యవస్థ సమర్థతను కూడా పరీక్షిస్తామని తెలిపాయి.

More Telugu News