Karnataka: హిమాచల్ సీఎం సతీమణి సాధనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన కర్ణాటక సీఎం!

  • కర్ణాటక నుంచి హిమాచల్ వెళ్లిన మతిస్థిమితం లేని మహిళ
  • ఆమెతో కన్నడలో మాట్లాడి వివరాలు కనుక్కొన్న సాధనా ఠాకూర్
  • తానూ కన్నడిగనేనన్న సాధన  

మైసూరుకు చెందిన ఓ మహిళ హిమాచల్ ప్రదేశ్ లో తప్పిపోగా, ఆమెను గుర్తించి, తిరిగి కర్ణాటకకు చేర్చడంలో సాయం చేసిన హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సతీమణి సాధనా ఠాకూర్ కు సీఎం కుమారస్వామి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో సాధన కన్నడలో మాట్లాడారని, అది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. త్వరలోనే షిమ్లా వెళ్లి ఆమెను కలుస్తానని చెప్పారు.

కాగా, మైసూరుకు చెందిన 30 ఏళ్ల మహిళను భర్త వదిలేయగా, మతిస్థిమితం కోల్పోయిన ఆమె, భర్తను వెతుక్కుంటూ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లింది. అక్కడి భాష తెలియక ఆమె ఇబ్బందులు పడుతుంటే, స్థానికులు కొందరు ఆమె కర్ణాటకకు చెందినదని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆపై టీవీ చానళ్లలో వార్తలు రాగా, వాటిని చూసిన సాధన, ఆమెను తన వద్దకు పిలిపించుకుని, కన్నడలో మాట్లాడి, ఆమె వివరాలు కనుక్కుని, కర్ణాటక అధికారులకు సమాచారం ఇచ్చి, ఆమెను సురక్షితంగా మైసూరు చేర్చారు.

ఇక కుమారస్వామి ఫోన్ చేసిన విషయమై సాధన స్పందిస్తూ, తాను కన్నడిగనే అని తెలుసుకున్న కుమారస్వామి చాలా ఆనందించారని అన్నారు. కుమారస్వామికి దయాగుణం అధికమని తెలిపారు.

More Telugu News