Jet Airways: మరో రెండు నెలల్లో మూత.. వార్తలపై స్పందించిన జెట్ ఎయిర్‌వేస్

  • వార్తలపై వివరణ కోరిన స్టాక్‌ఎక్స్‌చేంజ్
  • కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్న జెట్ ఎయిర్‌వేస్
  • మూత వార్తలు నిజం కాదని స్పష్టీకరణ

మరో రెండు నెలల్లో జెట్ ఎయిర్‌వేస్ మూతపడబోతోందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది.  మరో 60 రోజుల్లో సంస్థను మూసివేస్తున్నామని, ఎవరి దారి వారు చూసకోవాల్సిందిగా తమ ఉద్యోగులకు జెట్ ఎయిర్‌వేస్ చెప్పినట్టు శుక్రవారం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆ సంస్థ సీఈవో వినయ్ దూబే ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని కొట్టిపడేశారు. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో గట్టి పోటీ ఉందని పేర్కొన్న ఆయన విమానయాన సంస్థలు కష్టాలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. రూపాయి విలువ క్షీణించడం, పెరుగుతున్న ఇంధన ధరలకు, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న టికెట్ ధరలకు పొంతన లేకుండాపోతోందన్నారు.

శుక్రవారం హల్‌చల్ చేసిన వార్తల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మరో 60 రోజులకు మించి విమానాలను నడిపే పరిస్థితి లేదంటూ జెట్‌ఎయిర్‌వేస్ తమ పైలట్లకు చెప్పినట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు, సిబ్బంది వేతనంలో 25 శాతం కోతకు అంగీకరించాల్సి ఉంటుందని, లేకపోతే మొత్తం సంస్థే మూతబడే అవకాశం ఉందని అల్టిమేటం కూడా జారీ చేసినట్టు తెలిసింది. ఈ వార్తలపై స్పందించిన బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ జెట్‌ఎయిర్‌వేస్ వివరణ కోరింది. దీంతో స్పందించిన సంస్థ ఆ వార్తల్లో స్పష్టత లేదని తేల్చి చెప్పింది. కొందరు ఉద్దేశపూర్వకంగా వీటిని సృష్టిస్తున్నారని పేర్కొంది.

More Telugu News