కిడ్నాపైన తమ బిడ్డల కోసం యాదగిరిగుట్టకు తల్లిదండ్రుల పరుగులు... ఓ బిడ్డను గుర్తించి స్పృహ కోల్పోయిన తల్లి!

04-08-2018 Sat 07:30
  • గత సంవత్సరం కిడ్నాపైన ఆరో తరగతి బాలిక
  • యాదగిరి గుట్టలో గుర్తించిన తల్లిదండ్రులు
  • వ్యభిచార కూపంలో మగ్గిందని తెలుసుకుని రోదించిన తల్లి
  • విచారించి బిడ్డను అప్పగిస్తామన్న పోలీసులు

ప్రకాశం జిల్లాలో గత సంవత్సరం ఆరో తరగతి బాలిక కిడ్నాపైంది. నాలుగు సంవత్సరాల క్రితం మేడ్చల్ లో మూడేళ్ల పాపను అపహరించుకు వెళ్లారు. రెండు సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో స్కూలు కెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాలేదు. తమ పిల్లలు అదృశ్యమయ్యారంటూ వీరంతా పోలీసు కేసులు పెట్టి, చిన్నారుల ఆచూకీ కోసం కాళ్లరిగేలా తిరిగి, ఒళ్లు అలిసేలా ఏడ్చి మిన్నకుండిపోయారు. ఇప్పుడు వారి కళ్లల్లో చిన్న ఆశ... తమ బిడ్డ కనిపిస్తుందేమోనని.

గడచిన వారం రోజులుగా యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహిస్తున్న పోలీసులు, మొత్తం 15 మంది అమ్మాయిలను గుర్తించి, వారందరినీ రెస్క్యూ హోమ్ లకు తరలించగా, వారిలో తమ బిడ్డ ఉందేమోనని కిడ్నాపైన తల్లిదండ్రులు గుట్టకు పరుగులు పెడుతూ వస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు, పోలీసుల వద్దకు వచ్చి తమ బిడ్డ ఫొటోను చూపించి, పిల్లలందరినీ చూశారు. తన బిడ్డను గుర్తించిన ఆ తల్లి, ఇన్నాళ్లూ వ్యభిచార కూపంలో మగ్గిందని తెలుసుకుని స్పృహ కోల్పోయింది. గుండెలవిసేలా రోదించింది. మేడ్చల్ కు చెందిన మరో జంట సైతం తమ బిడ్డను గుర్తించి, బిడ్డను పంపాలని ప్రాధేయపడింది. వారిని ఓదార్చే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులు, విచారించి, రక్త పరీక్షలు చేసి బిడ్డలను అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

ఇక యాదగిరిగుట్టలో ఉన్న చిన్నారులను వివిధ ప్రాంతాల నుంచి కిడ్నాప్ చేసి తెచ్చారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు, గతంలో నమోదైన కిడ్నాప్ కేసులను పరిశీలిస్తున్నారు. తాము రక్షించిన 15 మందినీ ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంచామని, బాలికల తల్లిదండ్రులు ఆధారాలతో వస్తే పరిశీలించి చిన్నారులను వారికి అప్పగిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.