Virat Kohli: ఇంగ్లండ్ ముందు అడ్డుగోడలా కోహ్లీ... పొగడ్తలతో ముంచెత్తిన ప్రపంచ మీడియా!

  • తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులు
  • కోహ్లీ కింగ్ అంటూ పత్రికల్లో వార్తలు
  • రెండో ఇన్నింగ్స్ లోనూ నిలిచిన కోహ్లీ
  • గెలుపుపై మిగిలున్న ఆశలు

క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టు వెళ్లిపోతున్నా, అడ్డుగోడలా నిలబడి, ఇంగ్లండ్ పై భారీ స్కోరు చేసి, భారత విజయంపై ఆశలను సజీవంగా ఉంచిన విరాట్ కోహ్లీని ప్రపంచ స్పోర్ట్స్ మీడియా పొగడ్తలతో ముంచెత్తింది. కోహ్లీ వీరోచిత సెంచరీ చేశాడని, కెప్టెన్ ఇన్నింగ్స్ తో శభాష్ అనిపించాడని, కోహ్లీ కింగ్ అని హెడ్డింగులు పెట్టాయి. కాగా, తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులు చేసి, ఇంగ్లండ్ చేసిన స్కోరుకు చాలా దగ్గరగా భారత్ ను తీసుకెళ్లిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్ లోనూ అడ్డుగోడలా నిలిచాడు. ఓ చిరస్మరణీయ విజయానికి 194 పరుగులు చేయాల్సి వుండగా, టాప్ ఆర్డర్ విఫలమైనా కోహ్లీ నిలబడ్డాడు.

తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టు, రెండో ఇన్నింగ్స్ లో ఓ దశలో 87 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి, ఆపై టెయిలెండర్ల పోరాటంతో 180 పరుగుల వరకూ చేరింది. ఆపై ఇంగ్లండ్ బౌలర్లు భారత టాప్ ఆర్డర్ లోని మురళీ విజయ్, ధావన్, రాహుల్, రహానే, అశ్విన్ లను అవుట్ చేశారు. కోహ్లీ మాత్రం దృఢంగా నిలిచి, ఇంగ్లీష్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. జట్టును విజయం దిశగా నడిపించే బాధ్యతను తన భుజానపై వేసుకున్నాడు. కోహ్లీకి తోడుగా దినేష్ కార్తీక్ క్రీజులో ఉండగా, నేడు మరో 84 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. కోహ్లీ క్రీజులో ఉన్నంతవరకూ విజయంపై ఆశలు బతికున్నట్టే. ఎటొచ్చీ ఇతర బ్యాట్స్ మన్లు కోహ్లీకి ఎంతవరకూ సహకరిస్తారన్నదే ప్రశ్న.

More Telugu News