Kiki: 'కికి' చేస్తారా? కటకటాల వెనక చేద్దురు రండి!: బెంగళూరు పోలీసుల వార్నింగ్

  • ప్రాణాపాయమని హెచ్చరిస్తున్న పలు రాష్ట్రాల పోలీసులు
  • అరెస్ట్ చేసి జైల్లో పెడతామన్న బెంగళూరు నగర పోలీసులు
  • చట్టప్రకారం శిక్షించదగ్గ నేరమని వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్ 'కికి' చాలెంజ్ దూసుకెళుతున్న వేళ, ఇది ప్రాణాపాయమని హెచ్చరిస్తున్న పలు రాష్ట్రాల పోలీసులు, ఈ చాలెంజ్ ని స్వీకరించ వద్దని పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 'కికి'పై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఈ చాలెంజ్ ని స్వీకరించిన సెలబ్రిటీలనూ పోలీసులు హెచ్చరించారు. ఇక బెంగళూరు పోలీసులు కాస్తంత విభిన్నంగా నెటిజన్లను హెచ్చరిస్తూ, 'కికి' చాలెంజ్ స్వీకరించి, డ్యాన్స్ చేయాలంటే కటకటాల వెనకే చేయాల్సి వస్తుందన్నారు.

ఈ మేరకు బెంగళూరు పోలీసు శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖతాలో ఓ పోస్టు పెట్టింది. "మీరు రోడ్లపై కికి చాలెంజ్ నృత్యం చేస్తే కనుక... కటకటాల వెనుక మీరు డ్యాన్స్ చేసేలా చూస్తామని మేము హామీ ఇస్తున్నాం. 'కికి' చాలెంజ్ మీకు డ్యాన్స్ కిక్కు ఇవ్వదు సరికదా, చట్టం పవర్ ను చూపిస్తుంది" అని వ్యాఖ్యానించింది. 'కికి'లో భాగంగా నడుస్తున్న వాహనం నుంచి దిగి, నృత్యం చేసి, ఆపై మళ్లీ దాన్ని ఎక్కడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, చట్టప్రకారం ఇది శిక్షించదగ్గ నేరమని పోలీసులు వెల్లడించారు.

More Telugu News