Kerala: ర్యాంప్‌పై మెరిసిన ‘చేపల అమ్మాయి’.. ఖాదీ వస్త్రాలకు హనన్ ప్రమోషన్!

  • ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్ అయిన హనన్
  • చేపలు విక్రయిస్తున్న ఫొటోలు హల్‌చల్
  • కేరళ ఖాదీ వస్త్రాలకు ప్రమోషన్

హనన్.. సోషల్ మీడియాలో ఇటీవల ట్రోల్ అయిన ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాలేజీ ఫీజుల కోసం, ఇంటి ఖర్చుల కోసం చేపలు అమ్ముతున్న హనన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల విపరీతంగా ట్రోల్ అయ్యాయి. జీన్స్ ప్యాంట్, షర్ట్, చేతికి ఉంగరాలతో ఆమె చేపలు విక్రయించడం వివాదం అయింది. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్యాంటు, షర్టు ధరించడం నేరమంటూ ముస్లిం మతపెద్దలు హుంకరించారు. మరోవైపు అదంతా సినిమా షూటింగ్‌లో భాగమని మరికొందరు తేల్చి చెప్పారు. కాగా, చదువు కోసం హనన్ పడుతున్న కష్టాలు గురించి తెలిసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెకు అండగా నిలిచారు.

తాజాగా, ఖాదీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓనమ్-బక్రీద్ ఎక్స్‌పో’లో హనన్ ర్యాంప్‌పై మెరిసింది. డిజైనర్ లంగా వోణీ ధరించి వయ్యారాలు పోయింది. అందరినీ మంత్రముగ్ధులను చేసింది. కేరళ ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ శోభన జార్జ్ మాట్లాడుతూ ఆమెకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కాగా, తనకీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితలను కలిసిన హనన్ కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News