Andhra Pradesh: బాలింతను నడి రోడ్డుపై వదిలేసిన వైద్య సిబ్బంది.. తన కారులో తీసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి!

  • గిరిజనుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం
  • ఇంటికి నడిచి వెళ్లాలని ఆదేశం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

గిరిజనుల పట్ల కొందరు అధికారులు, సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతున్న ఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళితే, ఇంట్లో ప్రసవమైన దుర్గ అనే బాలింత తూర్పు గోదావరి జిల్లా బోదులూరు పీహెచ్సీకి మెరుగైన వైద్యం నిమిత్తం వెళ్లింది. ఆపై ఆమెను 'తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్'లో ఇంటికి చేర్చాల్సిన సిబ్బంది, మద్యలోని ఆకుమామిడికోటలో దింపేసి, అక్కడి నుంచి ఆమె నివాసమున్న బంద గ్రామానికి నడిచి వెళ్లాలని ఓ ఉచిత సలహా పారేసి తమదారిన తాము పోయారు.

దీంతో చేసేదేమీ లేక, బిడ్డను ఎత్తుకున్న ఆ బాలింత రోడ్డుపై నడిచి వెళుతుండగా, మారేడుమిల్లి మండలంలో జరిగిన 'గ్రామదర్శిని - గ్రామవికాసం'లో పాల్గొని వస్తున్న రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆమెను చూశారు. విషయమేంటని అడిగి, ఆమెను తన కారు ఎక్కించుకుని తిరిగి బోదులూరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యాధికారులు లేకపోవడంతో సిబ్బందితో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆమెకు రూ. 2 వేలు ఆర్థిక సాయం చేసి, అంబులెన్స్ లో ఇంటికి పంపించారు.

More Telugu News