Harish Rao: మార్కెట్ ఫీజును దుర్వినియోగపరిచిన సిబ్బందిపై వేటుకి తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆదేశాలు!

  • అల్వాల్ రైతు బజార్ ను సీఎం ఆదేశాల మేరకు ఆధునికీకరించాలి
  • కోహెడలో కొత్త పండ్ల మార్కెట్ ఏర్పాటు
  • జనగాం మార్కెట్ లో ఫీజు దుర్వినియోగపర్చిన సిబ్బందిపై వేటు
  • హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డులు, గోదాముల్లో లక్ష మొక్కలు నాటాలి

అల్వాల్ రైతు బజార్ ను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్&బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ కు ఆనుకుని ఉన్న కంటోన్మెంట్, రైల్వే, ఆర్&బీ లకు సంబంధించిన స్థలం కొంత తమకు అప్పగిస్తే అల్వాల్ రైతు బజార్ ను అద్భుతంగా ఆధునికీకరించి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ స్థలం గుర్తించేందుకు ఈరోజు సాయంత్రం సంయుక్త సర్వే నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

జనగాం మార్కెట్ ఫీజును దుర్వినియోగపర్చిన సిబ్బందిపై వేటు:

జనగాం మార్కెట్లో 5 లక్షల 22 వేల ఫీజును వసూలు చేసి దుర్వినియోగపర్చిన మార్కెట్ సెక్రటరీ సంతోష్ కుమార్, సూపర్ వైజర్లు రమేష్, మహమ్మద్ పాషా, అటెండర్ మహమ్మద్ ఆలీను సస్పెండ్ చేయాలని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయికి మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్కెట్ కమిటీకి ఉత్తర్వులు పంపాలన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మార్కెటింగ్ శాఖ ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్లో నిర్వహించాలన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డైరక్టర్ లక్ష్మీబాయిని మంత్రి ఆదేశించారు. కూకట్ పల్లి రైతు బజార్ ను పది కోట్లతో ఆధునికీకరణ చేసే పనులకు రేపు ఉదయం శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న రైతు బజార్ ను హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం గడ్డి అన్నారం వద్ద ఉన్న మార్కెట్ కు మెట్రో స్టేషన్ వల్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు హయత్ నగర్ మండలం కొహెడ్ వద్ద 178 ఎకరాల్లో, 164 కోట్ల అంచనా వ్యయంతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణ పనులకు వెంటనే టెండర్లు పిలిచి, పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు.

హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు నాటాలి:

హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గోదాములు, మార్కెట్ యార్డులలో లక్ష మొక్కలు నాటాలని మంత్రి హరీశ్ రావు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఒకటిన్నర మీటర్ల నుంచి రెండు మీటర్ల ఎత్తు ఉండే మంచి మొక్కలు, ఫలాలు వచ్చే లక్ష మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, ఈ సమీక్షలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, ఓఎస్డీ జనార్దన్ రావు, అడిషనల్ డైరెక్టర్, జేడీలు, రైల్వే, కంటోన్మెంట్, ఆర్&బీ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News