Nara Lokesh: ‘ముఖ్యమంత్రి-యువనేస్తం’ పేరిట నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి!: మంత్రి నారా లోకేశ్

  • నిరుద్యోగ భృతి విధివిధానాలకు మంత్రి వర్గం ఆమోదం
  • మూడు లేదా నాలుగో వారంలో ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్లు 
  • ఒక కుటుంబంలో ఎంతమందికైనా ఈ భృతి చెల్లిస్తాం

ఏపీలో నిరుద్యోగ భృతి పథకానికి ‘ముఖ్యమంత్రి - యువనేస్తం’ పేరు పెట్టామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ రోజు అమరావతిలో నాలుగు గంటల పాటు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి విధివిధానాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అనంతరం, మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని, నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అర్హులుంటే ఒక కుటుంబంలో ఎంతమందికైనా చెల్లిస్తామని, ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో నిరుద్యోగ భృతికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ లో ప్రారంభమవుతుందని, పదిహేను రోజుల పాటు ఈ రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తామని అన్నారు.

రిజిస్ట్రేషన్లు పూర్తయిన పదిహేనురోజుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు చెప్పారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, అప్రెంటిషిప్ కింద వివిధ సంస్థల్లో నిరుద్యోగులకు పని కల్పించాలని యోచిస్తున్నామని, ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. కాగా, రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల ఖాళీల భర్తీకి, 9 వేల టీచర్ల పోస్టులతో పాటు ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి, వుడాకు విశాఖ మెడ్ టెక్ జోన్ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపునకు, ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు, కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు, నూతన చేనేత విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వుడాను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీగా పేరు మార్చారు. వుడా పరిధి 5573 చదరపు కిలో మీటర్లను 6764.59 చదరపు కిలో మీటర్ల మేరకు పెంచారు.

More Telugu News