paltan: భారత్, చైనా పోరుపై ‘పల్టన్’.. విడుదలైన ట్రైలర్!

  • 1967 యుద్ధంపై జేపీ దత్తా సినిమా
  • ఆకట్టుకుంటున్న సంభాషణలు
  • సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల

భారత్-చైనాల మధ్య 1962లో భీకరమైన యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత చైనా మరోసారి సిక్కింను, మిగతా దేశాన్ని కలుపుతున్న 'నాథులా పాస్'ను స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించింది. కానీ ఈసారి పూర్తి సన్నద్ధతతో ఉన్న భారత్ ఆర్మీ దీటుగా స్పందించడంతో చైనా భారీగా నష్టపోయి తోకముడిచింది.

  'బోర్డర్', 'ఎల్వోసీ కార్గిల్' చిత్రాల దర్శకుడు జేపీ దత్తా ఇప్పుడీ ఘటన ఆధారంగా ‘పల్టన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. జాకీష్రాఫ్, సోనూసూద్, అర్జున్ రాంపాల్,  సిద్ధార్థ్ కపూర్, గుర్మిత్ చౌధురి, హర్షవర్ధన్ రాణె, మోనికా గిల్, ఇషా గుప్తా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

‘సోదరసోదరీ మణులారా..! మన భూభాగంపై చైనా బలగాలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయి’ అంటున్న నెహ్రూ రేడియో ప్రసంగంతో సినిమా ట్రైలర్ మొదలవుతుంది. సిక్కింను దక్కించుకునేందుకు చైనా సైన్యం యత్నించడం, దాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టే సీన్లు హైలైట్ గా నిలిచాయి. భారత బలగాలు బెదరకపోవడంతో ఇండియా-చీనీ భాయ్ భాయ్ అంటూ చైనా సైనికులు మైండ్ గేమ్ ఆడటం మనం చూడొచ్చు. చివరికి భారత్-చైనా సైన్యాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే సీన్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ చిత్రానికి అనూ మాలిక్ సంగీతం అందించగా.. జీ స్టూడియోస్, జేపీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


More Telugu News