Arizona: 20 ఏళ్ల క్రితం రెస్టారెంట్‌లో దొంగతనం.. వడ్డీతో పాటు పంపిన వైనం.. కదిలిపోయిన యజమాని!

  • లేఖ చదివి కన్నీళ్లు పెట్టుకున్న యజమాని
  • తనను క్షమించాలని వేడుకున్న మాజీ వెయిట్రెస్
  • సోషల్ మీడియాలో లేఖ వైరల్

రెండు దశాబ్దాల క్రితం తాను పనిచేసిన రెస్టారెంట్‌లో డబ్బు దొంగిలించిన ఓ వెయిట్రెస్ పశ్చాత్తాపంతో ఇప్పుడా సొమ్మును వడ్డీ సహా పంపింది. దానికి ఓ క్షమాపణ లేఖను కూడా జోడించింది. తన క్షమాపణను అంగీకరించాలని, డబ్బులు తీసుకోవాలని అందులో కోరింది. లేఖ చూసిన రెస్టారెంట్ యజమాని హృదయం ద్రవించిపోయింది.  

అమెరికాలోని టక్సన్‌లో ఉన్న మెక్సికన్ రెస్టారెంట్‌ 'ఎల్ చారో కేఫ్' యజమాని చార్లొట్టా ఫ్లోరెస్‌కు జూన్ 27న ఓ కవర్ అందింది. అందులోని లేఖను చదివిన చార్లొట్టా ఆశ్చర్యపోయింది. అందులో ‘‘1990లలో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో చదువుకుంటూ మీ రెస్టారెంట్‌లో పనిచేశాను. వెయిట్రెస్‌గా పనిచేసిన నేను తోటి వెయిట్రెస్ ప్రోద్బలంతో పాకెట్ మనీ కోసం కొంత డబ్బు దొంగిలించి తప్పు చేశాను. ఇప్పటికి 20 ఏళ్లు అయినా, ఆ తప్పు నన్ను ఇంకా వెంటాడుతోంది.

 రెస్టారెంట్‌లో దొంగతనానికి పాల్పడిన నన్ను మీరు క్షమించాలి. నా క్షమాపణను స్వీకరించడంతోపాటు, దొంగిలించిన సొమ్ముకు 20 ఏళ్ల వడ్డీతో కలిపి పంపుతున్న వెయ్యి డాలర్లను స్వీకరించండి. దేవుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ మేలు చేస్తాడు’’ అని ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖను చదివిన రెస్టారెంట్ యజమాని సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

More Telugu News