Amit shah: నన్ను అరెస్ట్ చేస్తారా? చేయండి చూద్దాం!: మమతకు అమిత్ షా సవాల్!

  • 1‌1న కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీ
  • తొలుత అనుమతి నిరాకరించిన పోలీసులు
  • తనను ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానంటూ షా సవాలు

మమతా బెనర్జీ ప్రభుత్వం తనను బెదిరించలేదని, తాను కోల్‌కతా వెళ్లే తీరుతానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పోలీసులు తనను ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానని సవాలు విసిరారు. ఈ నెల 11‌న కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలని అమిత్ షా భావించారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ- తృణమూల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ తరుణంలో అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరణతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ‌

తన ర్యాలీకి అనుమతి నిరాకరణపై స్పందించిన షా మాట్లాడుతూ ఇది అనుమతికి సంబంధించిన అంశం కాదని, తాను కోల్‌కతా వెళ్లే తీరుతానని తేల్చి చెప్పారు. షా హెచ్చరించిన కాసేపటికే కోల్‌కతా పోలీసులు ఓ ట్వీట్ చేస్తూ, షా ర్యాలీకి అనుమతి మంజూరు చేసినట్టు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు ఢిల్లీలో ప్రతిపక్ష నేతలతో సమావేశంలో బిజీగా ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ అమిత్ షా ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లొచ్చని సూచించారు.

More Telugu News