Imran khan: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి గవాస్కర్, కపిల్‌దేవ్, సిద్ధు, ఆమిర్ ఖాన్ లకు ఆహ్వానాలు

  • వివిధ దేశాల ప్రముఖులకు ఆహ్వానాలు 
  • ఇమ్రాన్ ప్రధాని అవుతారని అప్పుడే చెప్పిన గవాస్కర్
  • ఈ నెల 11న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం

పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఈ నెల 11న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధు, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌లను ఆహ్వానించారు. అలాగే, సార్క్ దేశాల ప్రముఖులను కూడా తన ప్రమాణ స్వీకారానికి ఇమ్రాన్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  

కెప్టెన్‌గా 1992లో పాకిస్థాన్‌కు క్రికెట్ ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన సారథ్యంలోని పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 116 సీట్లను మాత్రమే గెలుచుకుని అధికారానికి అవసరమైన మరో 22 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో చిన్నా, చితకా పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ సిద్ధమయ్యారు.  

ఇదిలా ఉంచితే, 2012లో ఆసియాకప్‌లో భాగంగా ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగిన సందర్భం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఆ మ్యాచ్ కి రమీజ్ రాజాతో కలిసి గవాస్కర్ కామెంటరీ బాక్స్‌లో ఉన్నారు. రమీజ్ రాజా మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో తాను ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. గవాస్కర్ అందుకుని.. పాకిస్థాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ అని పేర్కొన్నారు. దీంతో కామెంటరీ బాక్స్‌లో నవ్వులు విరిశాయి. సరిగ్గా ఆరేళ్ల తర్వాత ఇప్పుడు గవాస్కర్ జోస్యం నిజమై ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

More Telugu News